calender_icon.png 21 January, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోషకాల్లో మునగండి

21-01-2025 01:07:33 AM

మునగ చెట్టులోని ప్రతి భాగం ఆరోగ్యాన్నిస్తుంది. మునక్కాయలు మొదలుకొని ఆకులు, పువ్వులు, వేర్లు అన్నిట్లోనూ మనకు ఆరోగ్యాన్నిచ్చే అనేక పోషక వనరులు దాగి ఉన్నాయి. నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మునగతో రైస్, చట్నీ, పొడి, జ్యూస్.. ఇలా అనేక రకాల రెసీపీలను రెడీ చేసుకోవచ్చు. అవేంటో చూద్దామా..

మునగాకు పొడి

వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి ఈ పొడితో రోజూ ఒక ముద్ద అన్నం తింటే ఎంతో మేలు జరుగుతుంది.

కావాల్సిన పదార్థాలు

* మునగాకులు  ఒక కప్పు

* పల్లీలు  ఒక చెంచా

* నూనె  ఒకటిన్నర చెంచా

* శెనగ పప్పు  ఒక చెంచా

* నువ్వులు  ఒక చెంచా

* మినప పప్పు  ఒక చెంచా

* ఎండు మిర్చి  పది

* వెల్లుల్లి రెబ్బలు  పది

* ధనియాలు  ఒక చెంచా

* చింత పండు  కొద్దిగా..

* ఉప్పు రుచికి సరిపడా

* జిలకర  ఒక చెంచా

తయారీ ఇలా

మునగాకులను నీళ్లలో శుభ్రంగా కడిగి ఒక వస్త్రంలో వేసి తడి లేకుండా ఆరబెట్టాలి. స్టవ్ మీద కడాయి పెట్టి అర చెంచా నూనె వేయాలి. అందులో తడి లేని మునగాకులను వేసి వేయించాలి. మునగాకు పొడిపొడిగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో పల్లీలు, నువ్వులు వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

ధనియాలు, ఎండు మిర్చి, వెల్లుల్లి, శెనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. మునగాకుతో పాటూ వేయించిన అన్ని పదార్థాలను మిక్సీలో వేయాలి. అందులో జిలకర, చింతపండు కూడా వేసి పొడిలా చేయాలి. రుచికి సరిపడా ఉప్పును అందులో వేయాలి. అంతే మునగాకు పొడి రెడీ అయినట్టే. వేడి వేడి అన్నంలో ఈ మునగాకు పొడి వేసి, కాస్త నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. 

మునగాకు చట్నీ

కావలసిన పదార్థాలు: మునగాకు ఆకులు -ఒక గుత్తి, పచ్చిమిర్చి - 7-8, వెల్లుల్లి రెబ్బలు - 7-8, ఉప్పు - రుచికి తగినంత, అల్లం - చిన్న ముక్క, ఆవాలు - 1/2 టీస్పూన్, జిలకర - 1/2 టీస్పూన్, కరివేపాకు కొన్ని రెమ్మలు, ఎండు మిరపకాయలు - 2, నూనె - 1 టేబుల్ స్పూన్, కొద్దిగా నీరు

తయారీ విధానం: మునగాకు ఆకులను శుభ్రంగా కడగండి. ఒక పాత్రలో నూనె వేసి వేడి చేయండి. ఆవాలు, జిలకర, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేగించండి.  

మునగాకు జ్యూస్

కావాల్సిన పదార్థాలు 

* మునగ ఆకులు

* నీరు

* ఉప్పు (రుచికి తగినంత)

తయారీ విధానం

మునగ ఆకులను శుభ్రంగా కడిగి, అదనపు నీటిని తీసివేయండి. ఒక పాత్రలో నీరు మరిగించి, అందులో మునగ ఆకులను వేసి, మరోసారి మరిగించాలి. మరిగించిన ఆకులను చల్లార్చి, బ్లెండర్‌లో కొద్దిగా నీరు వేసి మిక్సీ చేయాలి. మిక్సీ చేసిన మిశ్రమాన్ని జల్లెడ ద్వారా వడకట్టాలి. వడకట్టిన రసానికి రుచికి తగినంత ఉప్పు వేసి తాగాలి.

మునగాకు రెస్

మునగాకు రైస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. తెల్ల అన్నం తిన్నా కూడా మునగాకు వల్ల ఆ చెడు ప్రభావం పడకుండా ఉంటుంది. అలాగే అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. 

కావాల్సిన పదార్థాలు

* మునగాకులు కప్పు

* వెల్లుల్లి రెబ్బలు  ఆరు

* జిలకర  ఒక చెంచా

* ఎండుమిర్చి 

* నువ్వులు  ఒక చెంచా

* ధనియాలు  ఒక చెంచా

* ఉప్పు -రుచికి సరిపడా

* అన్నం  ఒక కప్పు

* మిరియాల పొడి  ఒక చెంచా

* ఆవాలు  ఒక చెంచా

* పచ్చిశనగపప్పు - ఒక చెంచా

* మినప్పప్పు ఒక చెంచా

* జీడిపప్పులు  గుప్పెడు

తయారీ ఇలా 

స్టవ్ మీద కడాయి పెట్టి రెండు ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు, జిలకర, వెల్లుల్లి రెబ్బలు, మునగాకులు వేసి వేయించుకోవాలి. ఈ మొత్తాన్ని చల్లార్చి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద మరొక కడాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో ఆవాలు వేసి చిటపటలాడించాలి. తర్వాత శెనగపప్పు, మినప్పప్పు, రెండు ఎండుమిర్చి, తరిగిన వెల్లుల్లి వేసి బాగా వేపుకోవాలి.

జీడిపప్పులను కూడా వేసి వేయించుకోవాలి. అందులోనే ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి కలపాలి. మునగాకు పొడిని, రుచికి సరిపడా ఉప్పును వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని పులిహోరలా కలుపుకోవాలి. అంతే టేస్టీ మునగాకు రైస్ రెడీ అయినట్టే.