calender_icon.png 24 October, 2024 | 5:03 AM

ఇంత నిర్లక్ష్యమా?

24-10-2024 02:31:39 AM

క్వాలిటీ కంట్రోల్ ఇలాగేనా?

  1. బరాజ్‌లు చూడకుండానే నిర్ణయాలా? 
  2. రికార్డులు చూడకుండా అఫిడవిట్‌లా? 
  3. కీలక పదవిలో విధుల నిర్వహణ ఇలాగేనా? 
  4. కాళేశ్వరం క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజినీర్ అజయ్‌కుమార్‌పై ఘోష్ కమిషన్ ఆగ్రహం 
  5. ముగ్గురు అధికారుల విచారణ

* 2021 జనవరి వరకు ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ కోసం ప్రత్యేకమైన సిబ్బంది లేరు. ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ టీంను ఏర్పాటు చేసిన తర్వాత రామగుండం ఈఎన్సీకి రిపోర్టు ఇచ్చాం. ఆ నివేదికపై ఈఎన్సీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సీడబ్ల్యూసీ మాన్యువల్ నిబంధనలు పాటించలేదు. 

 ఈఎన్సీ నాగేందర్

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజినీర్ అజయ్ కుమార్ తీరుపై జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కీలకమైన ఉద్యోగంలో ఉండి ఇంత నిర్లక్ష్యంగా ఎలా విధులు నిర్వహిస్తున్నారని కడిగిపారేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతున్న కమిషన్.. బుధవారం బహిరంగ విచారణను పునఃప్రారంభించింది. ముగ్గురు అధికారుల నుంచి వివరాలు సేకరించింది. ముఖ్యంగా అజయ్‌కుమార్‌తో పాటు ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ ఈఎన్సీ నాగేందర్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. నాగేందర్‌పై మూడు గంటలకు పైగా ౧౩౦ ప్రశ్నలు సంధించింది.

విధుల్లో నిర్లక్ష్యం వహించటంపై అజయ్‌కుమార్‌పై ఆగ్రహం వ్యక్తంచేసింది. మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బరాజ్‌లను ఎన్ని సార్లు సందర్శించారని ప్రశ్నించగా మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లకు ప్రమాదం జరగకముందు పరిశీలించానని అజయ్‌కుమార్ సమాధానమిచ్చారు. సుందిళ్లకు ఎప్పుడు వెళ్లింది గుర్తులేదని తెలిపారు.

తొలిసారి వరద వచ్చాక 3 బరాజ్‌లను సందర్శించారా? అని కమిషన్ ప్రశ్నించింది. నిర్మాణం పూర్తయిన తర్వాత తాను వెళ్లలేదని ఆయన తెలిపారు. దీంతో అసహనం వ్యక్తంచేసిన ఘోష్.. బరాజ్‌లను ఎలా నిర్మించారో పరిశీలించేందుకు కూడా వెళ్లరా? అని నిలదీసింది. సమస్యలు ఉన్నాయని నివేదిక రాకపోవడంతో సందర్శించలేదని ఆయన జవాబిచ్చారు.

అయితే క్వాలిటీ కంట్రోల్ సీఈ స్థాయిలో ఉంటూ రికార్డులను సరిచూసుకోకుండానే అఫిడవిట్ ఎలా సమర్పిస్తారని కమిషన్ ప్రశ్నించింది. ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాన బాధ్యత ఉన్న క్వాలిటీ కంట్రోల్ సీఈ ఈ విధంగా విధులు నిర్వర్తించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది.

బరాజ్ నిర్మాణంలో లోపాలున్నాయని గుర్తించి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి నోటీసులు ఇచ్చినట్లు క్వాలిటీ కంట్రోల్ సీఈ సర్ధార్ ఓంకార్ సింగ్ కమిషన్‌కు తెలిపారు. కానీ గుత్తేదారు ఆ పనులను చేయలేదని వెల్లడించారు. 

నిర్వహణ లోపాలతోనే ప్రమాదం

నిర్వహణ లోపాలతోనే బరాజ్‌లు ప్రమాదానికి గురయ్యాయని ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ ఈఎన్సీ నాగేందర్ తెలిపారు. కమిషన్ ఆయనను మూడు గంటలకు పైగా విచారించింది. 130 ప్రశ్నలు సంధించింది. రామగుండం ఈఎన్సీ నిబంధనలు పాటించలేదని కమిషన్‌కు నాగేందర్ తెలిపారు. రామగుండం ఈఎన్సీ స్టేట్ అండ్ సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని చెప్పారు.

ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లనే మూడు బరాజ్‌లు దెబ్బతిన్నాయా? అని కమిషన్ ప్రశ్నించగా... 2021 జనవరి వరకు ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ కోసం ప్రత్యేకమైన సిబ్బంది లేరని ఆయన తెలిపారు. 2021 జనవరిలో ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ టీంను ఏర్పాటు చేసిన తర్వాత రామగుండం ఈఎన్సీకి రిపోర్టు ఇచ్చామని, ఆ నివేదికపై ఈఎన్సీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు.

ఓ అండ్ ఎం ఇన్‌స్పెక్షన్ రిపోర్టును కమిషన్‌కు అందజేసిన నాగేందర్... సీడబ్ల్యూసీ మాన్యువల్ నిబంధనలు పాటించలేదని అంగీకరించారు. డ్యామ్ సేఫ్టీ నిబంధనలు పాటించారా? అని కమిషన్ ప్రశ్నించగా.. నిర్మాణ సంస్థలు అగ్రిమెంట్ ఆపరేషన్స్ ప్రొటోకాల్ డ్యామ్ సేఫ్టీ నిబంధనల మేరకు పనిచేయలేదని నాగేందర్ తెలిపారు. 2019 నుంచి మూడు బరాజ్‌లలో పరిమిత స్థాయిలో నీళ్లను నిలువ చేసినట్లు వివరించారు.

బరాజ్‌కు ప్రమాదం జరిగే ముందు ఓ అండ్ ఎం పరిశీలన చేశారా? బరాజ్‌లలో నీళ్లను నిలువ చేయాలని ఎవరు ఆదేశించారు? అని కమిషన్ ప్రశ్నించిగా.. రామగుండం ఈఎన్సీకి మౌకిక ఆదేశాలు ఉన్నాయని నాగేందర్ సమాధానమిచ్చారు. రామగుండం ఈఎన్సీ చేతిలోనే మూడు బరాజ్‌ల పనులు నడిచినట్లు నాగేందర్ తెలిపారు.