calender_icon.png 1 November, 2024 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దాపూర్ గురుకులంలో పాముల పుట్టలు

10-08-2024 05:54:19 PM

తవ్వినకొద్దీ పుట్టల్లోoచి బయటకు పాములు

మొన్న ఒకరు, నిన్న మరొక విద్యార్ధి మృతితో

పెద్దాపూర్ గురుకుల విద్యాలయం ఖాళీ 

 చదువుకునే విద్యార్ధులంతా ఇళ్లకు

ఓ పక్క అధికారుల సందర్శన.. మరోపక్క పాముల సంఘర్షణ

జగిత్యాల, (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల విద్యాలయంలో చదువుకునే ఇద్దరు విద్యార్థులు 15 రోజుల్లో అనుమానస్పద స్థితిలో మరణించగా పెద్దాపూర్ గురుకులం  అంతా ఖాళీ అయింది. చదువుకునే విద్యార్ధులంతా ఇంటిబాట పట్టారు. గురుకులంలో పాములు పుట్టలు కుప్పలు తెప్పలుగా వెలుగు చూస్తున్నాయి. ఓ పక్క అధికారుల సందర్శనలు..మరోపక్క పాముల సంఘర్షణలు కొనసాగుతున్నాయి. పెద్దాపూర్ గురుకుల విద్యాలయం లో కనుచూపు మెరలో కూడా పరిశుభ్రత కానరావడం లేదు. కానీ విద్యార్థుల మరణాల పెనువివాదం మెడకు చుట్టుకొకుండా తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికి, గురుకులం ఆవరణలో పాములు పెట్టుకున్న పుట్టలు, ఆ పుట్టల్లోంచి అధికారుల కళ్ళముందే నాట్యమాడుతూ బయట పాడుతున్న పాముల ఆనవాళ్లు కనిపించకుండా చేసేందుకు అధికారులు పడరాని పాట్లు పడుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది.

పెద్దాపూర్ గురుకుల విద్యాలయంలో 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు 542 మంది విద్యార్థులు చదువుకుంటుండగా 22మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నారు. కానీ విద్యార్థులు చదువుకునేందుకు, ఉపాద్యాయులు, అధ్యాపకులు చదువు చెప్పేందుకు మినహా ఉండేందుకు పిల్లలకు, టీచర్లకు ఎలాంటి వసతి సౌకర్యాలు లేవు. వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా నిధులు విడుదల కాకపోవడంతో చేసేదేమీ లేక ఉపాద్యాయులు,అధ్యాపకులు అప్పోసప్పో చేసి తరగతి గదుల నిర్మాణం, క్లాసుల నిర్వహణకు అవసరమైన ఖర్చులు పెట్టుకొని కడుపులోనే బాధలు దిగమింగు కుంటున్నారు. 15రోజుల వ్యవధిలో 

ఇద్దరు విద్యార్థులు మరణించాక ఆగమేఘాల మీద తాత్కాలిక మరమ్మత్తులు మొదలు పెట్టారు. పాలకుల నిర్లక్ష్యానికి నిలువుట ద్దంగా మారుతుంది పెద్దాపూర్ గురుకుల విద్యాలయం, వరుస సంఘటనలతో ఓ పక్క విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, మరో పక్క అధికారులు గురుకుల విద్యాలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నుండి గురుకులంలో మరమ్మత్తులు చేపడుతూ పాముల పుట్టలు మచ్చుకు కనిపించకుండా యాయం చేస్తున్న తరుణంలో ఆ పుట్టలోంచి పాములు పెద్ద ఎత్తున కనిపించడంతో గురుకులంలో పని చేసే సిబ్బంది, ఉపాద్యాయులు, అధ్యాపకుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో శుక్రవారం అనిరుధ్ అనే విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

దీంతో ఆగమేఘాలమీద అధికారులు గురుకులం ఆవరణలో మరమ్మతులు చేపడుతున్నారు. శనివారం ఉదయం మెట్ పల్లి ఆర్డీఓ నక్క శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి గురుకుల పాఠశాలను సందర్శించారు. ఓ పక్క అధికారులు సందర్శనలు చేస్తుండగా మరోపక్క కుప్పలు తెప్పలుగా పాములు పుట్టల్లొంచి బయటపడుతున్నాయి, శుక్రవారం ఉదయం జెసిబి తో పరిసరాలను పరిశుభ్రం చేస్తున్న క్రమంలో రెండు పాములు కంటపడగా శనివారం  జేసిబితో శుభ్రం చేస్తుండగా మరో ఆరు పాములు అధికారుల కళ్ళ ఎదుట పుట్టల్లోంచి బయటపడ్డాయి. పాములు బయటకు రాగానే అక్కడున్న వారు ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు.

రెండు పాములను జేసిబిలతో చంపివేయగా నాలుగు నాగులు చెట్లలోకి వెళ్ళిపోయాయి. పరిసరాలను పరిశుభ్రం చేస్తున్న పరిస్థితిలో కూడా పెద్ద ఎత్తున పాములు కనిపించడం అక్కడి వాతావరణ పరిస్థితికి అద్దం పడుతుంది. కాగా తాటిపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ కు పెద్దాపూర్ గురుకుల పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ గా బాధ్యతలు అప్పగించారు. అయితే పెద్దాపూర్ గురుకుల విద్యాలయం చుట్టూ పంట పొలాలు ఉండటం, అధిక దిగుబడుల ఆశించిన అన్నదాతలు పంట పొలాలకు క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం లేకపోవడంతో పాములు గురుకులంలో చిరబడినట్లుగా నిన్నమొన్నటి వరకు చెబుతూ వచ్చిన గురుకులం సిబ్బంది, ఉపాద్యాయుల, అధ్యాపకుల, అధికారులు కళ్ళ ఎదుట పుట్టల్లో పాములు పెనవేసుకొని బయటకు వస్తుండటంతో భయాందోళనలు చెందుతున్నారు.