calender_icon.png 18 January, 2025 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొట్టలో పాము

07-10-2024 12:00:00 AM

‘పంచతంత్ర కథామంజరి’ శీర్షికన ‘ఆంధ్రప్రభ’ వారపత్రిక, 2003 జనవరి 4 సంచికలో ప్రచురితమైన దివంగత డా. అయాచితం నటేశ్వరశర్మ వారి చిన్నకథ (రహస్యాలను వెల్లడించి, మృత్యువు పాలైన సర్పాల కథ)ను ‘విజయక్రాంతి’ పాఠకుల కోసం ఇక్కడ పునర్ముద్రిస్తున్నాం.

ఎడిటర్

డా. అయాచితం నటేశ్వరశర్మ :

పూర్వం ఒక నగరంలో దేవశక్తి అనే రాజు వుండే వాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. అతడి పొట్టలో ఒక పాము ఉండేది. దానివల్ల అతడు రోగగ్రస్తుడై రోజురోజుకూ కృశించి పోసాగాడు. ఎందరో వైద్యులు ఎన్నో విధాలుగా చికిత్సలు చేసినా అతనికి స్వస్థత చేకూర లేదు. అప్పుడు ఆ రాజకుమారుడు నిర్వేదంతో దేశాటన చేస్తూ పొరుగు దేశానికి చేరుకున్నాడు.

అక్కడ ఒక నగరం లోనికి ప్రవేశించి, భిక్షాటన చేస్తూ, పెద్ద దేవాలయంలో బస చేస్తూ కాలం గడుపుతుండేవాడు. ఆ నగరాన్ని బలి అనే రాజు పాలిస్తుండేవాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. వారిద్దరూ యౌవనవతు లు. రోజూ సూర్యోదయ సమయంలో తండ్రి దగ్గరికి వచ్చి పాదాభివందనం చేసేవారు. అలాగే, ఒకనాడు వారిలో ఒకతె తండ్రికి నమస్కరిస్తూ, 

“మహారాజా! మీకు విజయం కలుగుగాక! మీ అనుగ్రహం వల్లనే అందరికీ సౌఖ్యం కలుగుతూంది” అన్నది.

అంతలో రెండవ కుమార్తె, 

“మహారాజా! మీకు తగినవే అనుభవించండి!” అన్నది.

రెండవ కుమార్తె మాటలు విని మండిపడ్డ ఆ మహారాజు, 

“ఓ మంత్రులారా! దుర్భాషలాడిన ఈ నా కుమార్తెను ఒక విదేశీయునికి అప్పగించండి” అని ఆదేశించాడు.

వారు అలాగే ఆమెను తీసుకొని పోయి, ఒక దేవాలయంలోని ఆ రాకుమారునికి అప్పగించారు. అప్పుడు ఆమె అతణ్ణి వివాహం చేసుకొని, భర్త ను భగవంతుడుగా భావించి, సంతోషంతో సపర్యలు చేస్తూ, కొన్నాళ్లకు మరో దేశానికి తీసుకొని పోయింది. ఆ నగరంలోని ఒక చెరువు గట్టుమీద అతణ్ణి వుండమని చెప్పింది. తాను బియ్యం, నూనె, పప్పులు, నెయ్యి మొదలైన సరకులను కొనుక్కొని రావటానికి నగరం లోపలికి వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసరికి అతడు ఒక పాముల పుట్టమీద తల పెట్టి నిద్ర పోతున్నాడు. అతని కడుపులో వున్న సర్పం నోటిలో నుంచి బయటికి వచ్చి, అలా అతని నోటిలో వుండే గాలిని పీల్చుకొంటూ వుంది. ఇంతలో పుట్టలో నుంచి బయటికి వచ్చిన మరో సర్పం కూడా గాలిని పీల్చుకొంటూ వుంది. 

ఈ దృశ్యం చూసిన రాజకుమార్తె దిగ్భ్రాంత అయింది. వాటి కంట పడకుండా పక్కనున్న చెట్టు చాటున దాక్కుంది. 

పుట్ట మీదున్న సర్పం, 

“ఒరే దురాత్ముడా! ఇంత సుందరుడైన రాకుమారుణ్ని బాధ పెడుతున్నా వెందుకు?” అని అడిగింది. అప్పుడు రాకుమారుని నోటిలో నుంచి బయటికి వచ్చిన సర్పం, 

“ఒరే! నీవు కూడా నీ పుట్టలో రెండు స్వర్ణకలశాలను వుంచుకోలేదా?” అని అడిగింది.

అప్పుడు పుట్టమీది పాము, 

“ఒరే, దురాత్ముడా! ఎండి పోయిన జీవంతీ లతలను తింటే నీవు చస్తావని ఎవరికీ తెలియదు. నాకే తెలుసు” అని పలికింది.

ఇంతలో అక్కడున్న మూడో సర్పం, 

“ఒరే! నీవు కూడా కాగుతున్న నూనెతో కానీ, నీళ్లతో కానీ మరణిస్తావని నాకు మాత్రమే తెలుసు” అని చెప్పింది. 

ఈ మాటలను విన్న రాజకుమార్తె, అవి మాట్లాడినవన్నీ గుర్తు పెట్టుకొని, ఆ విధంగానే చేసి వాటిని చంపేసింది. దానితో రాజకుమారుడు ఆరోగ్యవంతుడు కాగా, ఆమె భర్తతోసహా తన తండ్రి రాజ్యానికి ప్రయాణం కట్టింది. తల్లిదండ్రులూ, బంధువులూ ఆమె సమయస్ఫూర్తికి మెచ్చుకొన్నారు. తరువాత ఆమె భర్తతో సుఖంగా జీవితం గడిపింది. 

రచనా కాలం: 2003, 

‘కథా నిలయం’ సౌజన్యంతో..