ఫతేపూర్, జూలై 9: పదే పదే పాము కాటుకు గురైనా అదృష్టవశాత్తు కోలుకొని బయటపడ్డాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు. 35 రోజుల వ్యవధిలో ఆరుసార్లు పాముకాటుకు గురై మృత్యుం జయుడు అనిపించుకుంటున్న ఈ యువకుడి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఫతేపూర్ జిల్లా సౌరా గ్రామానికి చెందిన వికాస్ దూబే (24) జూన్ 2న తన ఇంట్లోని మంచంపై నుంచి లేస్తుండగా పాము కాటేసింది. దీంతో, కుటుంబ సభ్యులు హుటాహుటిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్నాడు.
ఇలా తరచూ పాము కాటుకు గురవుతూనే ఉన్నాడు. జూ లై 6 నాటికి ఏకంగా ఆరు సార్లు పాము కాటుకు గురయ్యాడు. నాలుగో పాము కాటు తర్వాత వైద్యులు అతన్ని ఇళ్లు విడిచి మరో చోటుకు వెళ్లాలని సూచించారు. దీంతో అతడు బంధువుల ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాడు. అనంతరం తల్లిదండ్రులు మళ్లీ అతన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఆ వెంటనే మరోసారి పాముకాటుకు గురయ్యాడు. జూలై 6న మరోసారి పాము కాటేసింది. ఈ క్రమంలో అతడి ఆరోగ్య పరిస్థితి దిగజారింది. కొడుకును చూసి ఆందోళన చెందిన తల్లిదండ్రులు మరోసారి ఆసుప్రతిలో చేర్పించారు.
వైద్యుల ప్రయత్నం ఫలించి అతడు కోలుకున్నాడు. తనను శని, ఆదివారాల్లోనే పాములు కాటేస్తున్నాయని, పాము కాటుకు ముందు ప్రతిసారీ మనసు ఏదో కీడు శంకించి అశాంతికి లోనవుతుందని చెప్పుకొచ్చాడు.