ఇద్దరు సెక్యూరిటీ గార్డులను కాటేసిన పాము
ఒకరి మృత్యువాత, మరొకరి పరిస్థితి విషమం
విజయక్రాంతి (బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా కాజీపేట మండలంలోని ఓరియంట్ సిమెంట్ కంపెనీలో శనివారం దారుణం చోటుచేసుకుంది. సిమెంట్ ఫ్యాక్టరీలో నిద్రిస్తున్నఇద్దరు సెక్యూరిటీ గార్డులను శనివారం తెల్లవారుజామున పాము కాటేసింది. ఈ ఘటన ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులను భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న తిర్యాణి ప్రాంతానికి చెందిన నవీన్ (25) అనే యువకుడు అక్కడికక్కడే మృత్యువాతకు గురయ్యాడు. నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వైభవ్ అనే మరో యువకుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా కార్మికులు హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కార్మికులను తీవ్రంగా కలిసి వేసింది.