21-02-2025 12:00:00 AM
బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 20: బాలికల వసతి గృహాలలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారుల ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రామంలోని షెడ్యూల్ కులాల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా హాస్టల్లో బాలికల డార్మెటరీ, వంటగది స్టోర్ రూమ్ లను పరిశీలించారు. వంట సరుకుల సరఫరా ఎలా ఉందని ఏదైనా ఇబ్బంది ఉంటే తెలియజేయాలని అన్నారు. అలాగే మెనూ ప్రకారం అల్పాహారం వండేందుకు అవసరమైన వంట పాత్రల కొరత ఉంటే జిల్లా వ్యాప్తంగా అన్ని ఎస్సీ హాస్టల్లలో పరిశీలించి వాటి కొనుగోలు కోసం ప్రతిపాదనలు పంపాలని జిల్లా ఇంచార్జి ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి హామీద్ ను ఆదేశించారు.
మెనూ ప్రకారం అల్పాహారం, భోజనంతో పాటు స్నాక్స్ కచ్చితంగా అందించాలని అన్నారు. బాత్రూంలకు సరిగా డోర్స్ లేకపోవడంతో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మాధవి పై ఆగ్రహం వ్యక్తం చేసి బాలికల హాస్టల్లలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే కొత్త డోర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తాసిల్దార్ సరిత, ఎంపీడీవో లక్ష్మప్ప ఉన్నారు.