calender_icon.png 1 November, 2024 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మృతి సితారా సిరీస్ హమారా

24-06-2024 02:18:37 AM

బెంగళూరు: పొట్టి ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరిగిన సిరీస్‌లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నీ విభాగాల్లో సమష్టిగా కదంతొక్కిన టీమిండియా.. వరుసగా మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరిదైన మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ బృందం 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3 క్లీన్‌స్వీప్ చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.

కెప్లెన్ లౌరా వాల్వర్ట్ (61; 7 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్ బ్రిట్స్ (38) రాణించింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 102 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు చేసేలా కనిపించినా.. ఆ తర్వాత జోరు కనబర్చిన మన బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆ జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. మరీనె కాప్ (7), బాష్ (5), లుస్ (13) విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 40.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.

గత రెండు వన్డేల్లో శతకాలతో చెలరేగిన వైస్‌కెప్టెన్ స్మృతి మంధన (83 బంతుల్లో 90; 11 ఫోర్లు) మరోసారి రెచ్చిపోయింది. వరుసగా మూడోసారి మూడంకెల స్కోరు చేసేలా కనిపించిన స్మృతి శతకానికి పది పరుగుల దూరంలో వెనుదిరగగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (42), షఫాలీ వర్మ (25), ప్రియా పునియా (28), జెమీమా రోడ్రిగ్స్ (19 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో మ్లాబా, ఖాకా, టుమీ తలా ఒక వికెట్ పడగొట్టారు. 10 ఓవర్ల కోటాలో 27 పరుగులే ఇచ్చిన దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, మూడు మ్యాచ్‌ల్లో కలిపి 343 పరుగులతో పాటు ఒక వికెట్ తీసిన స్మృతి మంధనకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.