25 May, 2026 | 2:39 AM

సజావుగా ధాన్యం కొనుగోళ్లు

25-05-2026 01:55 AM

గజ్వేల్ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

గజ్వేల్, మే 24 : జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళు సజావుగా కొనసాగుతున్నాయని కలెక్టర్  హైమావతి అన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి కొనుగోలు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా కొనసాగుతున్నాయని, ఏఎంసీల్లో వరితో పాటు మక్కలను కూడా కొనుగోలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

వరి, మక్కజొన్న ఒకేసారి మార్కెట్లకు రావడంతో హమాలీలు, లారీల కొరత ఏర్పడిందన్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు స్థానిక గ్రామాల హమాలీలను కేంద్రాల్లో వినియోగిస్తున్నామని, లారీల కొరత నివారణకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎక్కువ ధాన్యం ఉన్న కేంద్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ధాన్యం నిల్వ సమస్య దృష్ట్యా ఏఎంసీల్లో గోదాములు, షెడ్లను వినియోగించి దిగుమతులు చేపడుతున్నామని, గోదాంలలో నిల్వ చేయడం వల్ల ధాన్యం లిఫ్టింగ్ వేగంగా జరుగుతోందన్నారు. రైతులు పండించిన పంట చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని,  కొనుగోలు ప్రక్రియ వేగవంతానికి రైతులు అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు.