calender_icon.png 24 October, 2024 | 9:51 AM

స్మిత ఫిజికల్లీ ఫిట్.. మెంటల్లీ అన్‌ఫిట్

23-07-2024 01:04:42 AM

మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిని నడిపించింది ఐఏఎస్‌లే..

స్మితాసబర్వాల్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

నాతో మళ్లీ పరీక్షలు రాయడానికి సిద్ధమా?

మాజీ బ్యూరోక్రాట్ బాలలత సవాల్‌

* 48 గంటల్లో స్మితా సబర్వాల్ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. లేదంటే నిరవధిక నిరాహార దీక్ష చేపడుతాం. 

 బాలలత

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): దివ్యాంగుల పట్ల సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్ ‘సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టుపై మాజీ బ్యూరోక్రాట్ బాలలత ఆగ్రహం వ్యక్తంచేశారు. స్మిత పెట్టిన పోస్టు దివ్యాంగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నదని అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బాలలత మాట్లాడుతూ.. స్మిత పెట్టిన పోస్ట్ తన వ్యక్తిగతమా? తెలంగాణ ప్రభుత్వ విధానమా? చెప్పాలని డిమాండ్ చేశారు. పని ఉన్నోళ్లు పని చేస్తారని, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉండరని అన్నారు.

స్మితా సబర్వాల్ ఫిట్‌గా ఉన్నారేమో కానీ మెంటల్‌గా అన్‌ఫిట్ అని విమర్శించారు. దివ్యాంగులు ఐఏఎస్‌కు అనర్హులు అని చెప్పడానికి స్మితకు ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించారు. తన సర్వీస్‌లో ఎన్ని రోజులు స్మిత ఫీల్డ్ వర్క్‌లో చాపర్లు, కార్లలో కాకుండా పరిగెడుతూ పని చేసిందో చెప్పాలని అడిగారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి రెండు కాళ్లు పనిచేయకున్నా బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందారని, ఐఏఎస్ అధికారులే ఆయన్ని నడిపించారని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ మాత్రమే ప్రీమియర్ పోస్టులు అని స్మితకు ఎవరు చెప్పారో చెప్పాలని చురకలంటించారు. ‘స్మితా.. మీకు దమ్ముంటే రాజీనామా చేసి రండి.. ఇద్దరం కలిసి సివిల్స్ పరీక్ష రాద్దాం. మనలో ఎవరకి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దాం?’ అని సవాల్ విసిరారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి ఆలోచించి స్మితాసబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని, ఆమెలాంటి ఆఫీసర్‌కి కీలక పోస్టు ఇస్తే ఏమవుతుందో అర్థం చేసుకోవాలని కోరారు. 24 గంటల్లో ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్మితాసబర్వాల్  ఆలోచనలపై సాటి ఐఏఎస్ లు స్పందించాలని అన్నారు. స్మితా సబర్వాల్ కి ఏదైనా జరగరానిది జరిగి దివ్యాంగురాలుగా మారితే ఐఏఎస్ కి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. స్మిత జస్ట్ ఒక ఐఏఎస్ అధికారి మాత్రమేనని.. ఆమె  పర్సనల్ లైఫ్, రీల్స్ గురించి తాను మాట్లాడనని అన్నారు.

కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసి అడ్మినిస్ట్రేషన్‌పైన అవగాహన లేకుండా మాట్లాడటం బాధాకరమని అన్నారు. స్టీఫెన్ హాకింగ్, సుధా చంద్రన్ వంటి మేధావులు అంగవైకల్యాన్ని జయించారని గుర్తుచేశారు. సివిల్స్ సర్వీసెస్లో దివ్యాంగుల  కోట అంశంపై స్పందిం చేందుకు కోర్టులు, చట్టసభలు ఉన్నాయని.. వాటిపై స్పందించడానికి మీరెవరుంటూ దుయ్యబట్టారు. సీఎం అయ్యాక రేవంత్‌రెడ్డి మొదటి ఉద్యోగ నియామకాన్ని దివ్యాంగురాలికి ఇచ్చారని ఆమె సందర్భంగా గుర్తు చేశారు. స్మిత పోస్టు దివ్యాంగుల పట్ల వివక్షతను చూపుతున్నదని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.