calender_icon.png 15 November, 2024 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో 30 స్మార్ట్ రేషన్ షాపులు

14-11-2024 12:51:07 AM

  1. హైదరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభం
  2. ఈ నెల 17 నుంచి శిక్షణ
  3. దశలవారీగా న్యూట్రీహబ్‌లుగా విస్తరణ

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (విజయక్రాంతి): ఇంటి అవసరాల కోసం సరుకులు కొనేందుకు ఏదో ఒక మార్ట్‌కు వెళ్తుండటం పరిపాటి. కానీ అలాంటి మార్ట్‌లు, స్మార్ట్ షాప్‌లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభు త్వం ప్రయత్నిస్తోంది.

అందులో భాగంగా జిల్లాలోని తెల్లరేషన్ కార్డుదారులకు మరిన్ని సేవలందించేందుకు, రేషన్ డీలర్ల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న రేషన్ షాపులను స్మార్ట్‌గా మినీ సూపర్‌మార్కెట్‌లుగా మార్చేందుకు నిర్ణయం తీసు కుంది.

జన్ పోషణ్ కేంద్ర పేరిట గుజరాత్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ సహా తెలంగాణలో ఆగస్టులో పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో 60 షాపులను ప్రారంభించింది. వాటిలో 15 షాపులు హైదరాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్నారు. వీటిని న్యూట్రీషన్ హబ్‌లుగా మార్చాలని భావిస్తున్నారు.

త్వరలో నగరంలో మరో 30 స్మార్ట్ రేషన్ షాపులను ఏర్పాటు చేయబోతున్నారు. అందుకోసం అర్హులైన వారిని ఎంపిక చేసి ఈ నెల 17 నుంచి మూడు రోజుల పాటు సివిల్ సప్లయ్, జన్‌పోషణ్ అధికారులు శిక్షణ ఇవ్వబోతున్నారు. 

డీలర్ల ఆదాయం పెంచేలా..

హైదరాబాద్ జిల్లాలో 9 సర్కిళ్లలో 653 షాపులుండగా, దాదాపు 6,39,476 ఆహా ర భద్రత కార్డులున్నాయి. ఈ కార్డుదారులున్న కుటుంబాలకు ప్రతీనెలా రేషన్ షాపుల ద్వారా బియ్యం, గోధుమలను సబ్సిడీపై అందిస్తున్నారు. గతంలో వీటితో పాటు కంది పప్పు, వంట నూనె లాంటి సరుకులను కూడా ఇచ్చేవారు. కాగా ఇటీవల కాలంలో పట్టణాలు, నగరాల్లో షాపింగ్‌మాల్స్, మార్టులు, సూపర్ మార్కెట్లు వచ్చాయి.

వాటిని దృష్టిలో పెట్టుకొని కేంద్రప్రభుత్వం రేషన్ షాపుల్లో జన్ పోషణ్ కేంద్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా చేపట్టిన పైలెట్ ప్రాజెక్ట్‌లో మొదటి విడతగా 15 రేషన్ షాపులను జన్ పోషణ్ కేంద్రాలు(మినీ సూపర్ మార్కెట్లు)గా మార్చింది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ సరుకులకు తోడు ప్రజలకు అవసరమైన ఇతర సరుకులను కూడా విక్రయించే అవకాశం కల్పించింది. 

ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యతను ఆయా రేషన్ షాపుల డీలర్లకే అప్పగించింది. వీటి ద్వారా రేషన్ డీలర్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఆగస్టు 20న నగరంలోని మలక్‌పేట, చార్మినార్, యాకుత్‌పురా, అంబర్‌పేట, ఖైరతాబాద్, బేగంపేట, సికింద్రాబాద్ సర్కిళ్లలో ప్రారంభమైన ఈ స్మార్ట్ రేషన్ షాపులు మంచి ఫలితాలనిస్తున్నట్లు ఆయా షాపుల డీలర్లు చెబుతున్నారు.

మొదటి విడతలో నాంపల్లి, మెహదీపట్నం సర్కిళ్లలో ప్రారంభించలేదు. కాగా రెండో విడతలో అన్ని సర్కిళ్లలో కలిపి మరో 30 జన్ పోషణ్ కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

సిడ్బీ ద్వారా రుణం.. 

జన్‌పోషణ కేంద్రాల నిర్వాహకులను వివిధ సర్కిళ్లకు చెందిన సివిల్ సప్లయ్ అధికారులు ఎంపిక చేస్తారు. గతంలో ఎంపిక చేసిన 15 మందికి ఈ కేంద్రాల నిర్వహణపై అవగాహన కోసం డిస్ట్రిక్ సివిల్ సప్లయ్ అధికారి రమేష్ ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లిన 15 మంది నగర రేషన్ డీలర్లకు ఐదురోజుల పాటు శిక్షణనిచ్చారు.

వారికి ఫర్నీచర్ కొనుగోలు, షాప్ నిర్వహణ కోసం సిడ్బీ (స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్) ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నారు. వుడాన్ యాప్ ద్వారా కొన్ని సరుకులు, వివిధ షాపుల ద్వారా మరిన్ని  సరుకులను తీసుకువచ్చి ఈ సూపర్ మార్కెట్లలో విక్రయిస్తారు. ముఖ్యంగా సిరిధాన్యాలు(మిల్లెట్స్), గోధుమలు, రాగులు, సజ్జలు లాంటి న్యూట్రిషన్ సరుకులను ఎక్కువగా విక్రయించేలా ప్రోత్సహిస్తున్నారు.