calender_icon.png 15 October, 2024 | 3:49 AM

గ్రేటర్‌లో స్మార్ట్ పోల్స్

15-10-2024 01:05:39 AM

సోలార్‌తో వీధి దీపాల కనెక్టివిటీ 

సీసీ కెమెరాలు, వైఫై, ఛార్జింగ్ పాయింట్స్

పీపీపీ మోడ్‌లో నిర్వహణపై బల్దియా కసరత్తు

ఇప్పటికే నగరంలో మూడు చోట్ల ఏర్పాటు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌లో వీధి దీపాల ఏర్పాటులో బల్దియా అధికారులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. వీధి దీపాల నిర్వహణలో తరచూ ఎదురవుతున్న సమస్యలకు, ప్రజల నుంచి వస్తున్న విమర్శలకు గ్రేటర్ అధికారులు స్మార్ట్‌గానే సమాధానం చెప్పాలని భావిస్తున్నారు.

దీంతో ప్రస్తుతం అనుసరించే విధానానికి కాస్త భిన్నంగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీధి దీపాల నిర్వహణను పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) మోడ్‌లో అందించడం ద్వారా మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని బల్దియా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే గ్రేటర్‌లో స్మార్ట్ ఎలక్ట్రికల్ పోల్స్‌ను ఏర్పాటు చేసి విద్యుత్, నిధులను ఆదా చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. 

గ్రేటర్‌లో 5 లక్షలకు పైగానే.. 

హైదరాబాద్ మహానగరంలో 6 జోన్లు, 30 సర్కిళ్ల పరిధిలో సుమారు 5 లక్షలకు పైగా వీధి దీపాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎస్‌ఎల్ ఏడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం గడువు సమీపంలోనే ఉంది. వీటిలో కేవలం 10 శాతం మాత్రమే టైమర్ల సహాయంతో ఆటోమెటిక్ ఆన్, ఆఫ్ అవుతుండగా, మిగతా 90 శాతం మాన్యువల్‌గా ఆపరేట్ చేయాల్సి వస్తుంది.

అయితే గ్రేటర్‌లో చాలాచోట్ల వీధి దీపాలు వెలగడం లేదని నిత్యం బల్డియాకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నా యి. వీధి దీపాల నిర్వహణ సక్రమంగా ఉండటం లేదనే విషయంపై ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) సంస్థ ప్రతినిధులపై బల్దియా కమిషనర్ ఆమ్రపాలి ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారికి చెల్లించాల్సిన దాదాపు రూ.80 కోట్ల బిల్లుల మంజూరును నిలిపివేసినట్లుగా సమాచారం. 

పీపీపీ మోడ్‌లో స్మార్ట్ పోల్స్.. 

వీధి దీపాల నిర్వహణకు సంబంధించి హైదరాబాద్ మహా నగరంలో ఇప్పటి వరకు ఇతర ఏజెన్సీలకు అప్పగించి కోట్లాది రూపాయలు చెల్లిస్తున్న బల్దియా తాజాగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానాన్ని అమలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో వీధి దీపాల నిర్వహణను చేపట్టడంతో పాటు సోలార్‌తో అనుసంధానం కానున్న ఈ వీధి దీపాల పోల్స్‌కు సీసీ కెమెరాలు, వైఫై సౌకర్యం, సెల్‌ఫోన్ ఛార్జింగ్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచనున్నారు.

దీంతో పాటు ప్రతి ఎలక్ట్రికల్ స్మార్ట్ పోల్‌కు ఒక డిజిటల్ స్క్రీన్ ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి బల్దియా సదరు సంస్థకు చెల్లించాల్సింది ఏమీ లేకపోగా.. బల్దియాకే సదరు సంస్థ ఎదురు చెల్లించనుంది. డిజిటల్ స్క్రీన్ ద్వారా ప్రకటనలు ఇచ్చి తద్వారా ఆదాయం పొందనున్నట్టు సమాచారం.

ఈ తరహాలో స్మార్ట్ ఎలక్ట్రికల్ పోల్స్ ఏర్పాటుకు గ్రేటర్ పరిధిలో ఇప్పటికే మూడు ఏజెన్సీలు ముందుకు రాగా.. ఇప్పటికే ఈ మూడు ఏజెన్సీలు సచివాలయం, కూకట్‌పల్లి, మాదాపూర్ ప్రాంతాల్లో ఒక్కో పోల్‌ను ఏర్పాటు చేశాయి.

వీటిలో ఏ సంస్థ మెరుగైన విధానాన్ని అనుసరిస్తుందో ఆ సంస్థకు బల్దియా అగ్రిమెంట్ దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ విధానం సక్సెస్ అయితే, ఇటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు బల్దియాకు సైతం కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని అధికారులు భావిస్తున్నారు.