calender_icon.png 22 February, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూపాలపల్లిలో స్మార్ట్ పాయింట్ మాయాజాలం..

17-02-2025 06:22:31 PM

- దొంగ బిల్లులతో కుచ్చుటోపి..

- కొనుగోలు చేసిన వస్తువుల బిల్లులో అదనంగా రూ.1285లు..

- ఆశ్చర్యానికి గురైన వినియోగదారుడు..

- షాపు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..

భూపాలపల్లి (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరునగర్ శివారులో గల రిలయన్స్ కంపెనీకి చెందిన స్మార్ట్ పాయింట్ లో మాయాజాలం వినియోగదారులను అయోమయానికి గురి చేస్తుంది. వినియోగదారులు కొనుగోలు చేసిన నిత్యవసర సరుకులతో పాటు, కొనుగోలు చేయని సరుకుల బిల్లు కూడా అదనంగా పడుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దొంగ బిల్లులతో వినియోగదారులకు కుచ్చుటోపి వేస్తుంది. ఓ వినియోగదారుడు కొనుగోలు చేసిన వస్తువుల బిల్లులో అదనంగా రూ.1285లు వేయడాన్ని గుర్తించడం సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మైసమ్మ కాలనీకి చెందిన టి.సుధాకర్ అనే వినియోగదారుడు నిత్యవసర వస్తువుల కొనుగోలు కోసం ఆదివారం సాయంత్రం మంజూరునగర్ శివారులోని రిలయన్స్ కంపెనీకి చెందిన స్మార్ట్ పాయింట్ షాప్ కు వెళ్లాడు.

కాగా షాపులో అవసరమైన సరుగులను కొనుగోలు చేసి కౌంటర్ వద్దకు వెళ్లగా, అక్కడే ఉన్న షాపులోని వర్కర్ కౌంటర్ వద్ద సరుకులన్నింటికీ బిల్లు వేయగా రూ.4813లు బిల్లు అయింది. టోటల్ బిల్లు రశీదు తీసుకొని మొత్తం చెల్లించి సరుకులను సుధాకర్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు. అయితే బిల్లు ఎక్కువగా వచ్చిందని అనుమానం వచ్చిన వినియోగదారుడు సుధాకర్ వెంటనే సరుకులను, వాటి బిల్లును చెక్ చేసి చూడగా రూ.1285 లు అదనంగా బిల్లులో ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే సరుకులను తీసుకొని షాపు నిర్వాహకుల వద్దకు వెళ్లగా సీసీ కెమెరాలు తనిఖీ చేసి చూశాడు. బిల్లులో అదనంగా రూ.1285 ఎలా వచ్చిందో తెలియదని, సీసీ కెమెరాలు మళ్లీ తనిఖీ చేస్తామని నిర్లక్ష్యపు సమాధానం చెప్పాడు.

చివరికి చేసేది లేక తమదే పొరపాటు జరిగిందని, రైస్ బ్యాగ్ బిల్లు అదనంగా పడిందని ఆ వస్తువు తీసుకోకుండా బిల్లు ఎలా పడిందో అర్థం కావడం లేదని చెప్పాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారుడు షాపు నిర్వాహకులను నిలదీశాడు. ఎంతో నమ్మకంతో షాపుకు వస్తే ఇలాంటి మోసం చేస్తారా, ఇలా రోజుకు ఎంతమంది వినియోగదారులను మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. నిర్వాహకుల తప్పిదం పై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు. ఈ విషయంపై వినియోగదారుల హక్కుల కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేయగా షాపు వద్దకు చేరుకుని తనిఖీ చేశారు. 

- వినియోగదారులను మోసం చేయడం నేరం..

- వినియోగదారుల హక్కుల కమిషన్ చైర్మన్ గోవర్ధన్..

వినియోగదారులను మోసం చేయడం నేరమేనని వినియోగదారుల హక్కుల కమిషన్ జిల్లా చైర్మన్ గోవర్ధన్ అన్నారు. స్మార్ట్ పాయింటు లో జరిగిన అదనపు బిల్లు మోసంపై ఫిర్యాదు అందగా ఆయన సోమవారం షాపును తనిఖీ చేశారు. ఈ విషయంపై బాధిత వినియోగదారున్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక విలేకరులతో చైర్మన్ గోవర్ధన్ మాట్లాడుతూ వినియోగదారులకు వినియోగదారుల హక్కుల కమిషన్ అండగా ఉంటుందన్నారు. ఈ విషయంపై పూర్తి సమాచారం సేకరించి రాష్ట్ర వినియోగదారుల హక్కుల కమిషన్ కు అందజేసి తగు చర్యలు తీసుకునేలా పాటుపడతానని ఆయన తెలియజేశారు.