calender_icon.png 23 October, 2024 | 12:54 PM

హోర్డింగ్స్ కోసమే స్మార్ట్ పార్కింగా?

23-09-2024 12:00:00 AM

  1. మల్టీ లెవల్ స్మార్ట్ పార్కింగ్ నిర్వహణ సంస్థ ఎంపికపై విమర్శలు
  2. సెప్టెంబర్‌లో జరిగిన స్టాండింగ్ కమిటీలో సంస్థ ఎంపికపై తీర్మానం 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ ౨౨(విజయక్రాంతి): ప్రభుత్వంలోని పెద్దల కనుసైగలకు అనుగుణంగా బల్దియా పాలక మండలిలో నిర్ణయాలు జరుగుతున్నాయా.. ?అభివృద్ధి పనుల కేటాయిం పులు టెండర్ల కంటే ముందుగానే ఖరారు అవుతున్నాయా..? అనే అంశాలు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. గ్రేటర్‌లో తాజాగా చేపడుతున్న మల్టీ లెవల్ స్మార్ట్ కార్ అండ్ మోటార్ సైకిల్ పార్కింగ్ నిర్మా ణం, నిర్వహణ బాధ్యతల అప్పగింతపై బల్ది యా విమర్శలను ఎదుర్కొంటోంది. 

అభ్యంతరం చెప్పిన నెలకే ఆమోదం..  

గ్రేటర్‌లో పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు 8 మల్టీ లెవల్ స్మార్ట్ పార్కింగ్‌లను ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. ప్రస్తుతం నాంపల్లిలో నిర్మాణం అవుతున్నది చివరి దశలో ఉండగా, తాజాగా కేబీఆర్ పార్కు గేటు నంబర్ 1 వద్ద మరో మల్టీ లెవల్ స్మార్ట్ పార్కింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాంతంలో 500 గజాల స్థలాన్ని టెండరు దక్కించుకున్న సంస్థకు 10 ఏళ్ల పాటు నిర్వహణ కోసం అప్పగించనున్నారు.

టెండర్లలో అత్యధికంగా రూ.28 లక్షలు కోడ్ చేసిన నవ నిర్మాణ్ సంస్థకు అప్పగించేందుకు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఈ నెల 12న తీర్మానం చేసింది. ఇదిలా ఉండగా, అంతకు ముందు ఆగస్టు 4న జరిగిన స్టాండింగ్ కమిటీలో నవ నిర్మాణ్ సంస్థకు బాధ్యతలు స్టాండింగ్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేబీఆర్ పార్కు వంటి ఏరియాలో 500 గజాల స్థలాన్ని లీజుకు ఇస్తే అంతకంటే అధిక ఆదాయం వస్తుందని పలువురు స్టాండింగ్ కమిటీ సభ్యులు వ్యాఖ్యలు చేశారు. అయితే, సరిగ్గా నెలరోజుల తర్వాత సెప్టెంబరు 12న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో తిరిగి ఆమోదం పొందడం గమనార్హం. 

15 అడుగుల కంటే ఎత్తులో హోర్డింగ్స్.. 

గ్రేటర్‌లో ప్రస్తుతం కొత్త హోర్డింగ్స్‌కు అనుమతి ఇవ్వడాన్ని నిలిపివేశారు. ఈ కారణంగా బల్దియా పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోతుంది. ఈ విధానాన్ని పునరుద్ధరించాలని పాలక మండలి భావిస్తుండగా, ప్రభుత్వం పరిశీలిస్తుంది. నగరంలో 15 అడుగుల కంటే ఎత్తులో ఎల్‌ఈడీ స్క్రీన్లు, హోర్డింగ్స్‌కు అనుమతి నిరాకరిస్తూ జీవో 68 ఉండగా, కేబీఆర్ పార్క్ వద్ద నిర్మించనున్న మల్టీ లెవల్ స్మార్ట్ కార్ అండ్ మోటార్ సైకిల్ పార్కింగ్‌కు ఈ జీవోను మినహాయిస్తూ మార్చి 14న జీవో ఆర్‌టీ నంబరు 143ను ఎంఏయూడీ తీసుకొచ్చింది.

దీంతో ప్రభుత్వమే జీవో నంబరు 68 నిబంధనలకు తిలోదకాలు ఇచ్చినట్టుగా స్పష్టమవుతోంది.  కాగా, ఈ పార్కింగ్ వద్ద 15 అడుగుల కంటే ఎత్తులో ఎల్‌ఈడీ స్క్రీన్లు, హోర్డింగ్స్ ఏర్పాటుకు 6 నెలల ముందుగానే ఎంఏయూడీ (మార్చి 14న) జీవో 143 జారీ కావడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. దీంతో ప్రభుత్వంలోని పెద్దల కనుసన్నల్లోనే బల్దియా పాలక మండలిలో నిర్ణయాలు జరుగుతున్నట్టుగా పలువురు చర్చించుకుంటున్నారు. 

70 కార్ల కోసమేనా పార్కింగ్

కేబీఆర్ పార్కు వద్ద 70 కార్లను పార్క్ చేసేందుకు వీలుగా నిర్మాణం చేయనున్నారు. ఇప్పటికే ఇక్కడ 40 కార్లు పార్క్ అవుతుండగా, ఇంకా 30 కార్లు పార్క్ చేయడానికే విలువైన 500 గజాల స్థలాన్ని 10 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. సదరు సంస్థ నిర్వాహకులు ఏడాదికి రూ. 28 లక్షలు మాత్రమే జీహెచ్‌ఎంసీకి చెల్లించనున్నారు. ఇక పార్కింగ్ చేసే వాహ నాలకు ఎంత రుసుము వసూలు చేస్తారో ఇంకేమీ నిర్ణయం కాలేదు. మల్టీ లెవల్ స్మార్ట్ పార్కింగ్ దగ్గర 15 అడుగుల కంటే ఎత్తులో కూడా ఎల్‌ఈడీ స్క్రీన్లు, హోర్డింగ్స్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల సదరు సంస్థ భారీ మొత్తంలో ఆదాయం పొందాలని భావిస్తున్నట్టుగా సమాచారం.