స్మార్ట్ ఇండియా హ్యాక్దాన్
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణ శివారులోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో స్మార్ట్ ఇండియా హ్యాక్దాన్ 2024 ఇంటర్నల్ హ్యాక్దాన్ ఉత్సాహంగా నిర్వహించారు. స్మార్ట్ ఇండియా హ్యాక్దాన్ అనేది మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థులకు ఒక ముఖ్యమైన వేదికగా ఉపయోగపడే దేశవ్యాప్త కార్యక్రమం. వాస్తవ ప్రపంచ సవాళ్లకు వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి మరియు ఆవిష్కరణలను ప్రదర్శించడానికి విద్యార్థులకు ఎస్ఐహెచ్ ఒక నిర్ణయాత్మక వేదికగా ఉపయోగపడుతుంది.
విద్యా మంత్రిత్వ శాఖ యొక్క ఇన్నోవేషన్ సెల్చే నిర్వహించబడిన స్మార్ట్ ఇండియా హ్యాక్దాన్ 2024, యువత పాలన, జీవన నాణ్యతను మెరుగు పరుచుకోవడం కోసం నూతన మార్గాలను అన్వేషించడం మరియు భారతదేశం ఎదుర్కొంటున్న కఠిన సమస్యలకు పరిష్కారం చూపించడం లక్ష్యంగా చేసుకుంది. ఈ కార్యక్రమం విద్యార్థుల మధ్య పోటీతత్వాన్ని పెంచడమే కాకుండా వారి ప్రతిభ, ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న 60 జట్లలో 45కు పైగా జట్లు తరువాతి రౌండ్కు చేరుకున్నాయి. ఈ కార్యక్రమం విద్యార్థులకు కృత్రిమ మేధా సైబర్ సెక్యూరిటీ సస్టైనబిలిటీ, స్మార్ట్ సిటీ వంటి అంశాలలో నిజ జీవిత సమస్యలపై పని చేసే అవకాశాన్ని కల్పించింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బృందం రైతులకు ఉపయోగపడే ఆప్ అయినా, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరుచుకునేందుకు లేదా నగరాలను హరితవనాలుగా తీర్చిదిద్దే మార్గాలపైన తమ ఆలోచనలను ఆవిష్కరించారు. జిట్స్ చైర్మన్ జువ్వాడి సాగర్ రావు సెక్రటరీ, కరస్పాండెంట్ సుమిత్ సాయి ఎస్ఐహెచ్ 2024లో పాల్గొనేందుకు విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ కె ఎస్ రావు, డీన్ అకాడమిక్స్ డాక్టర్ పి కే వైశాలి, కన్వీనర్ అండ్ SPOC డాక్టర్ ఎన్ వెంకటేశ్వరన్, కోఆర్డినేటర్ డాక్టర్ ఎం మణికందర్ అధ్యక్షత వహించారు. దాదాపు 400 మంది విద్యార్థులు మరియు విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలకు మద్దతునిచ్చిన మరియు ప్రోత్సహించిన అధ్యాపకులు పాల్గొన్నారు.