21-04-2025 01:48:27 AM
అవ్వ నడుముకు అలంకరణ
సంపద దాచే ఖజానా
సింగిడి రంగులతో ఉండేది
అవ్వ బువ్వ చేతి దిక్కుండేది
మా లచ్చవ్వ చెక్కుడు సంచి
నేటితరం మరిచిన బొడ్లసంచి
చెమటోడ్చి కష్టం చేసి
చీరకొంగుకు ముడి వేసి
పైసాపైసా జమ చేసి
బొడ్లెసంచిల దాచిన ధనం
మా భవిష్యత్తు మూలధనం
నా ఎరుకల నాకదే గల్లగురిగి
చిల్లర ఖర్చుల అల్మరా
నశం పొగాకు జర్దా తంబాకు
వక్క సున్నం కాసు తమలపాకు
అన్నీ దాచుకునే పేటిక
ఓరకు పెట్టుకునే వాటిక
కించిత్ కష్టం రాకుండా
అవసరాలు తీర్చిన కామధేను
దీలె పండుక్కు పటాకలు
దస్ర పండుక్కు బట్టలు
కానుకలు కొనిచ్చిన
తల్లి బంగారం
కరువు రానీయని భాండాగారం
మా లచ్చవ్వ చెక్కుడుసంచి
అందరు మెచ్చే బొడ్లసంచి
గుమ్మి నిండిననాడు
బర్రె ఈనిన నాడు
పాలు అమ్మిన నాడు
బొడ్లసంచి నిండుగ ఉన్ననాడు
ఏదో తెలవని సంతోషం
ఎక్కడా దొరకని ఆనందం
ఏకాణా దోవాణా మొదలు
పైసల కట్టలు చూసిన తరం
సుట్టాలను సాగదోలంగ
ఒక్క పైసిచ్చినా ఎంతో సంబురం
అవ్వచెయ్యి ముడతలయ్యింది
బొడ్లసంచి మోటుగయ్యింది
ఆసరాకోసం ఎదురుచూస్తూ
గుడ్డిదీపం పెట్టడానికి
కంట్రోలు బియ్యం తేవడానికి
నానా తంటాలు పడుతుంటే
అవ్వ బొడ్లసంచి యాదికచ్చింది.
-బొల్లం బాలకృష్ణ