31-03-2025 12:00:00 AM
ఏప్రిల్ 2 సీతారామచంద్రరావు జయంతి
ఏప్రిల్ 4 రాఘవ రంగారావు జయంతి
తెలంగాణ గర్వించదగ్గ వైతాళికులు ఒద్దిరాజు సోదరులు. అటు దేశభక్తిలోను, ఇటు సాహిత్యాభిలాషలోనూ ఎన్నదగిన కృషితో జీవితాలను సార్థకం చేసుకున్న మహానుభావులు. వారి అద్భుత రచనల్లో నమూనా వంటిది ఈ కథన సన్నివేశం. విజయక్రాంతి పాఠకుల కోసం అందిస్తున్నాం.
రామారావు రామనాధపురం జమీందారు. గోలకొండ వేపారి, విద్యా వైదుష్యములు తక్కువ యున్నాను పోఖ్తంగా సంసారము జరుపుకొనుచు పది కాసులు సంపాదించి యుంచెను. ప్రస్తుతపు కొందరు జమీందారుల వలె ఏ హైదరాబాదులోనో, ఏ మదరాసులోనో కాపురముండి తమ జమీందారీ గ్రామములు నల్లగా నుండునో, తెల్లగా నుండునో తెలియక సమస్తము దివానుమీద కట్టిపెట్టి నిరంతరం డబ్బు జరిపించుమని వ్రాయుచు, మోటార్లుకు, సాని మేళములకు, తోట విందులకు, సినిమేటోగ్రాపులకు, కంపెనీ డ్రామాలకు, కాఫీ హోటళ్లకు ధారవోసీ దివాను తన రైతుల నెట్ల పీడించుచున్నది గ్రహింపక ఎక్కువ డబ్బు పంపించెడి దివానులకు ప్రమోషను నిచ్చుచుండెడి వారివలె గాక రామానాధ పురములోనే యుండుచు రైతుల కష్టనిష్టురములు స్వయముగా విచారించుచు తాను బాగు పడుచు రైతులు మంచి స్థితి యందుంచు చుండెను.
రామారావునకు రాజారావను వొక కుమారుడు గలడు. తలిదండ్రులకు కొంచెమీడు బోయిన పిమ్మట కలుగట వలన కడుగారాబము గావించు చుండెను. నానా విధములయిన యుడువులు ధరించుట యందును గుఱ్ఱము సవారి చేయుట యందును నాతనికి గల శ్రద్ధ చదువునందు లేదు. శ్రీకారము పర్వతాకారము. కొడుకునకు శ్రద్ధ లేకున్నను చదువుకొనుమని తండ్రియైనను ప్రోత్సహించుట లేదు. ఎవరయిన మీ కుమారుని చదువు విషయమై మీరు పట్టించుకొనుట లేదేమని యడిగిన మాకట్టి చదువుతో నేమివని, భగవంతుని కృప వలన మాకంతో యింతో మిరాసి గలదు. ఏమి ఆధారము లేని వారికి చదువుగాని మాయట్టి వారి కెట్లైనా సరే యని యనును. అందువలన రాజారావు చదువును గురించి యాత్ర తంబయయ్యెను.
రాజారావుకు పదమూడు సంవత్సరములు వయస్సు వచ్చెను. జమీందారుల యిండ్లలో యీ యీడు వరునకు వివాహమై తీరవలయును. అందు బాపని దొరల యిండ్లలో యీ యీడునకు పెండ్లి కాకపోవడ ఎంతయైనను నా మోషి, మూడు వేల వరదక్షణతో కల్పనూరు దేశముఖు కూతురు లలిత కోడలుగా వచ్చి చేరును. పెండ్లి కూతురు కొడుకు బాణసంచా, బ్యాండు వాయిద్యము మొదలగు వినోదములు గని సంతసించిరి. తమ యావజ్జీవ కాలమండీ లాగున సంతోషమే జరుగునని యనుకొను చుండిరి కాబోలు.
ఆరు సంవత్సరముల కాలమున గడచిపోయెను. లలితకు యౌవనదశ వచ్చెను. కల్పనూరు దేశముఖు వెంకటరావు తన వియ్యపునకు శుభకార్యము జరుపుకొనపోవుటకు జాబు వ్రాసెను. రామారావు, ఆయన భార్య మిక్కిలి సంతసించిరి. రాజారావునకు గూడ కుతూహలముగానే యుండెను. ఒక దినము నిర్ణయింప బడినది. తలిదండ్రులు కుమారుడు కతిమయ బంధుభట వర్గముతో కల్పనూరికి చేరిరి. కార్యము జరిగెను. వారము దినముల పాటందరు కలసిమెలసి యుండిరి. రామారావు ఇంటికి జనుటకు తన కోరికను వియ్యంపునకు తెలిపెను. ఆయన అల్లుని పది దినముల పాటుంచుకొని తోలెదనని వియ్యంపుని వేడుకొనెను. రామరావందులకు సమ్మతించి కుమారుని అత్తవారింట విడచి తానొంతరిగా పయనమయ్యెను. తక్కిన బంధువులందరెక్కడి వారక్కడ జనిరి..
సంపదలు చెప్పిరానట్లే ఆపదలును చెప్పిరావు. అవి వాని యంతయని వచ్చును పోవుచునే యుండును. ఆనాడు .. దేశముఖు పదవి వెంకటరావు జ్ఞాతులు .. యభియోగము వలన ఆటనకు లేకుండ నయ్యెను. అనగా విచారణ ముగియు వరకు వెంకటరావు గ్రామమందు దేశముఖాగిరి పదవి చెల్లించుకొన గూడదు. వెనుకటి కాలమున అన్ని విషయములకును సర్కారు వారికి సాయ పడుచుండుల కతంబున దేశమందు కొందరు ముఖ్యులకు దేశముఖు పదవి యెసంగి కంత ద్రవ్య ముపకార వేతనముగా ప్రభుత్వము వారిచ్చు చుండిరి. మన కథ నాటికి దేశముఖులు సర్కారు వారికెట్టి సాయము చేయవలసిన యవసరము లేకున్నను ద్రవ్యము మాత్రము బొందుచు గ్రామమందు ప్రభుత్వము చేయుచునే యుండిరి. సర్కారు వారి పని చేయుటకు నియమింపబడిన సేతుబందీ వెట్టివాండ్రు తప్ప తక్కిన వేళలయందు దేశముఖు నౌకరి చేయవలసి యుండెడిది. అందువలన వెంకటరావు జీతగాండ్లుకు స్వంతమునకై పెట్టుకొనలేదు, పదవి పోయినంతనే పనివాండ్రు వెంకటరావు యింటికి వచ్చుట మానివేసిరి.
ఇతరుల కొలువులుండ కూడా చేసిరి. పూలు అమ్మిన యూరిలో కట్టెలమ్మినట్లు పదవి పోవుట, బజారు సామాను తెచ్చుటకు సైతము పనివాడు లేకుండ బోవుట యీ యవమానముల వలన వెంకటరావు గుండె బగిలి మంచమెక్కెను. యీచట యేడెనిమిది తరముల నుండి వచ్చుచున్న దాన వంశమందలి యొక ముసలి సేవకుడు తప్ప మరెవ్వరును లేరు. క్రమక్రమముగా వ్యాధి బలిష్టమగు చుండెను. మందు లేదు. వైద్యుడు లేడు. వీనికి వెళ్లు వారులేరు. అల్లుడభిమాన ధనుడు. ఆపత్కాలమందు మామకు సాయపడుత తన పరువును కెంతయో నష్టము. మామగారింటి సేవక బలము చూచుకొని తన చెంతనొక సేవకునియు రాజారావుంచలేదు. తాను పోను లేదు. అత్తయైనను పోవుటకు నాల్గు తెరల చాటున ఘోషాయందున్న దిగుట కతంబున యామెయు పోయి మందు తెచ్చుటకు వీలు గలుగ కుండెను. ఒకటి రెండుసారులు ఘోషా వదలి కూడా తెరచాటు నుండి అల్లుని మామకు మందు తెచ్చి సాయ పడుమని ప్రార్థించెను. కాని ఆమె ప్రార్థన అల్లునకు విపరేతముగా తోచినది.
తన తండ్రికి యెరుక లేక యీ సంబంధము కుదరించినాడు కాని మాతౌరునకు తగిన సంబంధము కాదు. అల్లుండంటే వీండ్లు సేవకుడని అనుకొంటూ వున్నారు. ఎవరికే పనులు చెప్పవలెనో వీరికి తెలియనే తెలియదు అని ఆక్షేపించెను. ఆ యధిక్షేపణము రోగియగు మామ విని అయ్యో వారికెందుకు పని చెప్పుచున్నారు? ఈ స్థితిలో దిక్కులేక చావవలసిన వ్రాత నాకు వ్రాసి యుండగా యెవరు సాయపడెదరు. అల్లుడే నాకుండేది యాతడయిన నాకీ యవస్థయే ప్రాప్తిందు అని తనలో తాను గొణుగు కొనెను.
‘తెలుగు రచయిత ఆర్గ్’ సౌజన్యంతో..