- బండ్లగూడ జాగీర్‌లోని చెరువు విస్తీర్ణం మొత్తం 34 ఎకరాలు
- ఇప్పటికే పావువంతు కంటే ఎక్కువ పరాధీనం
- బఫర్ జోన్‌లో దర్జాగా నిర్మాణాలు
- ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్న అధికారులు
- అందిన కాడికి దండుకుంటున్న కొందరు అధికారులు, నేతలు
- హైడ్రా కొరడా ఝులిపించాలని స్థానికుల విన్నపం
రాజేంద్రనగర్, ఆగస్టు 12: రోజురోజుకూ కబ్జాలు పెరిగిపోతుండటంతో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీరంచెరువు కనుమరుగవుతోంది. ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపో తున్నారు. పెబెల్ సిటీ నుంచి బీజాపూర్ ప్రధాన రహదారి వరకు ఆనుకొని ఉన్న పీరంచెరువు మొత్తం విస్తీర్ణం 34 ఎకరాలు. అందులో దాదాపు పావువంతు కంటే ఎక్కువే కబ్జాకు గురైంది. బఫర్ జోన్‌తోపాటు ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో భారీగా నిర్మాణాలు వెలుస్తున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
ఒకరిపై ఒకరు నెపం..
వివిధ శాఖల మధ్య లోపం అక్రమార్కులకు వరంగా మారింది. చెరువు బఫర్‌జోన్‌లో అక్రమంగా భారీ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు తమకు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. తమ పరిధిలోని అంశం కాదని ఇటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అటు ఇరిగేషన్ అధికారులు మాట దాట వేస్తుండటం యంత్రాంగం నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. పీరం చెరువు ప్రాంతంలోని ఆక్రమణలు, బఫర్ జోన్‌లో నిర్మాణాలు ఆయా శాఖల అధికారులతోపాటు కొందరు నేతలకు మేతగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న నిర్మాణదారుల నుంచి ఆయా శాఖల అధికారులు, నేతల స్థాయిని బట్టి వసూలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అరుదైన పక్షులకు నెలవు
పీరంచెరువు అరుదైన పక్షులకు నెలవుగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వివిధ రకాల పక్షులు వలస వస్తుంటాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో చెరువు సమీపంలో వాకింగ్, జాగింగ్ చేసు న్న వారికి విభిన్నమైన పక్షులు కనువిందు చేస్తున్నాయి. ఎంతో చరిత్ర ఉన్న పీరంచెరువును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై నా ఉన్నదని స్థానికులు పేర్కొంటున్నారు.
అధికారుల నివేదికతోనే అనుమతులు
పీరంచెరువు ప్రాంతంలోని అక్రమాలు, అదేవిధంగా నిర్మాణాలకు అనుమతుల విషయం ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల నివేదిక ప్రకారమే అందజేశామని మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి లక్ష్మి తెలిపారు. ఇందులో తమ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. కేవలం అనుమతులు ఇవ్వడం వరకు మాత్రమే తమ పరిధిలోకి వస్తుందని తెలిపారు.
అంతా బాగానే ఉంది..: డీఈఈ
పీరంచెరువులోని కబ్జాలు, బఫర్ జోన్‌లో నిర్మాణాల గురించి ఇరిగేషన్ శాఖ డీఈఈ రమను వివరణ కోరగా.. బఫర్ జోన్‌లో నిర్మాణాలు అలా కనిపిస్తాయని కానీ వాస్తవానికి అంతా బాగానే ఉందని పేర్కొనడం గమనార్హం. చెరువు కబ్జా, ఆక్రమణల విషయం హైడ్రా అధికారులు చూసుకుంటారని చెప్పారు. ఇలా శాఖల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులకు వరంగా మారింది.