04-04-2025 12:59:12 AM
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
దౌల్తాబాద్, ఏప్రిల్ 03: కాంగ్రెస్ ప్రభుత్వం పిల్ల కాలువలను త్వరగా పూర్తి చేసి చెరువులు, కుంటలను నింపాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని దొమ్మాట, గాజులపల్లి గ్రామాల్లో పటేల్ కుంట, పెద్ద చెరువు, కుమ్మరి కుంట, కన్నెకుంటల మత్తడిల వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వ హాయంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా దుబ్బాక నియోజకవర్గంలో లక్ష 30 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా మెయిన్ కెనాల్ కాల్వలు నిర్మించి రైతులకు సాగునీరు అందించారన్నారు. రైతుల సంక్షేమం కోసం కెసిఆర్ అహర్నిశలు కృషి చేశారని అన్నారు.
మల్లన్నసాగర్, కొండ పోచమ్మ ప్రాజెక్టుల ద్వారా మెయిన్ కెనాల్ నుంచి అన్ని గ్రామాలకు పిల్లకాల్వలు నిర్మించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందన్నారు. కెనాల్ ద్వారా రెండు గ్రామాల ప్రజలు సొంత డబ్బులతో పిల్ల కాలువలతో చెరువులు, కుంటలను నింపుకొని పంటలు పండించుకోవడానికి రైతులు భగీరథ ప్రయత్నం చేయడంతో రైతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, నాయకులు పాల్గొన్నారు.