జనవరి-మార్చి త్రైమాసికానికి వడ్డీ రేట్లు యథాతథం
చిన్న మొత్తాల పొదుపు పథకాలుగా పిలుచుకునే పోస్టాఫీస్ పొదుపు పథకాలకు కొత్త ఏడాది తొలి త్రైమాసికం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం 2025 జనవరి-డిసెంబర్ కాలానికి కూడా వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా అట్టిపెట్టింది. ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవ త్సరం జనవరి 1 నుంచి మార్చి 31తో ముగి సే 4వ త్రైమాసికంలో వివిధ చిన్న పొదుపు పథకాలకు మూడవ త్రైమాసికానికి (2024 అక్టోబర్ 1-2024 డిసెంబర్ 31 వరకూ నిర్ణయించిన వడ్డీ రేట్లే కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది.
సాధారణంగా బ్యాంక్ పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే కాస్త వడ్డీని ఎక్కువగా ఇచ్చే పోస్టాఫీస్ స్కీమ్స్ అంటే సామాన్య పొదుపరులకు మక్కువ. ఎందుకంటే వీటిలో చేసే మదుపు సురక్షితం. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుం ది. ఈ పథకాల్లో పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా ద్వారా 4 శాతం వడ్డీ రేటు లభిస్తుండగా, గరిష్ఠస్థాయిలో 8.2 శాతం వడ్డీ రేటును సుకన్య సమృద్ధి స్కీమ్ అందిస్తున్నది.
సీనియర్ సిటిజన్ స్కీమ్‌కు కూడా వడ్డీ 8.2 శాతమే. సురక్షిత పెట్టుబడి సాధనాల పట్ల ఆసక్తిచూపేవారికి పోస్టాఫీసు పథకాలు ఆ రక్షణ ఇవ్వడంతో పాటు స్థిరమైన రాబడిని సైతం ఇస్తాయి. వివిధ పోస్టాఫీసు పొదుపు పథకాలివే..
1. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా: ఈ పొదుపు ఖాతాను కనీసం రూ.500తో ప్రారంభించుకోవచ్చు. ఇందులో డిపాజిట్ చేయ డానికి గరిష్ఠ పరిమితి ఏదీ లేదు. ప్రతీ నెలా 10వతేదీ, చివరితేదీ మధ్య కనిష్ఠ నిల్వ ఆధారంగా వడ్డీని గణిస్తారు. ఈ ఖాతాకు ప్రస్తుతం 4 శాతం వడ్డీ లభిస్తున్నది.
2. నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా: ఈ డిపాజిట్ ఖాతా ఒక ఏడాది, రెండేండ్లు, మూడేండ్లు, ఐదేండ్ల కాలపరిమితుల్లో లభిస్తుంది. ఈ ఖాతాను రూ.1,000 కనీస పెట్టుబడితో, ఆపై రూ.100 గుణిజాల్లో కలుపుకుని ప్రారంభించవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. ఒక ఏడాదికి 6.9 శాతం, రెండేండ్ల డిపాజిట్‌పై 7 శాతం, మూడేండ్ల డిపాజిట్‌పై 7.1 శాతం, ఐదేండ్లకు 7.5 శాతం చొప్పున వడ్డీ ఆదాయం వస్తుంది.
3. నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఖాతా: ఈ ఖాతాను రూ.100 కనీస పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఆపై రూ.10 గుణిజాల్లో కలుపుకుని మదుపు చేయవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. ఐదేండ్ల రికరింగ్ డిపాజిట్ ఖాతాకు 6.7 శాతం వడ్డీ రేటు ఉన్నది.
4. నేషనల్ సేవింగ్స్ మంథ్లీ ఇన్‌కమ్ ఖాతా: నేషనల్ సేవింగ్స్ మంథ్లీ ఇన్‌కమ్ అకౌంట్‌ను రూ.1,000 కనీస పెట్టుబడితో ప్రారంభించవచ్చు. సింగిల్ ఖాతాకు గరిష్ఠ పెట్టుబడి పరిమితి రూ.9 లక్షలుకాగా, జాయింట్ అకౌంట్‌కు గరిష్ఠ పరిమితి రూ.15 లక్షలు. ఈ ఖాతాపై ప్రస్తుతం 7.4 శాతం వడ్డీని అందిస్తున్నారు.
5. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్: ఈ ఖాతాను సీనియర్ సిటిజన్లు రూ.1,000 నుంచి మొదలుకుని రూ.1,000 గుణిజాల్లో గరిష్ఠంగా రూ. 30 లక్షల వరకూ మదుపు చేసుకోవచ్చు. ఈ డిపాజిట్‌ను ఒకే దఫా చేయాలి. ఈ ఖాతాపై 8.2 శాతం వడ్డీని అందిస్తున్నారు.
6. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా
(పీపీఎఫ్): రూ.500 కనీస పెట్టుబడితో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ. 1,50,000 మాత్రమే మదుపుచేసేందుకు అనుమతిస్తారు. ఇందులో మదు పును ఒకే దఫాగానీ, వాయిదాల్లోగానీ పెట్టుబడి చేయవచ్చు. పీపీఎఫ్‌కు ప్రస్తుత వడ్డీ రేటు 7.1 శాతం.
7.సుకన్య సమృద్ధి పథకం: ఈ ఖాతాలో కనీస పెట్టుబడి రూ.250 కాగా, ఆపై రూ.50 గుణిజాల్లో ఒకే దఫాగా లేదా ఒక నెలలో, సంవత్సరంలో ఎన్నిసార్లయినా డిపాజిట్ చేయవచ్చు. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకూ మదుపు చేయవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడికి గరిష్ఠంగా 8.2 శాతం వడ్డీ లభిస్తుంది.
8. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ): నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో కనీస పెట్టుబడి రూ.1,000కాగా, ఆపై రూ.100 గుణిజాల్లో మదుపు చేయవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. దీనిపై ప్రస్తుతం 7.7 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నారు.
9.కిసాన్ వికాస్ పత్ర: రూ.1,000 కనీస పెట్టుబడితో ఆపై రూ.100 గుణిజాల్లో మదుపుచేసి కిసాన్ వికాస్ పత్ర తీసుకోవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. 7.5 శాతం వడ్డీ లభించే కిసాన్ వికాస్ పత్ర 115 నెలల్లో మెచ్యూర్ అవుతుంది.