‘స్లమ్‌డాగ్ మిలియనీర్’.. భాషతో సంబంధం లేకుండా ఆదరణను అందుకున్న చిత్రమిది. ఒక్క ఆస్కార్ అవార్డ్ వస్తేనే.. ప్రపంచమంతా ప్రశంసలతో ముంచెత్తుతుంది. అలాంటిది ఈ సినిమా ఏకంగా 8 అవార్డులను అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ చిత్రం 2008లో విడుదలైంది. ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకంటే.. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ రూపొందనున్నట్టు వార్తలు బయటకు వస్తున్నాయి.
ది హాలీవుడ్ రిపోర్టర్ కథనం ప్రకారం.. ఇటీవల బ్రిడ్జి 7 అనే నిర్మాణ సంస్థ ఈ సినిమా సీక్వెల్ హక్కులను సొంతం చేసుకుంది. ముంబై మురికివాడల్లో నివసించే చిన్నారుల జీవనం, వారి ప్రతిభ ఆధారంగా రూపొందిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ప్రపంచ వ్యాప్తంగా ఓ సంచలనం సృష్టించింది. ముంబై మురికివాడల్లో పెరిగిన ఓ బాలుడు తన ప్రతిభతో కౌన్ బనేగా కరోడ్‌పతిలో రెండు కోట్లు ఎలా గెలుచుకున్నాడనే అంశంతో ఈ చిత్రం రూపొందింది.
ఈ చిత్రానికి డానీ బాయిల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 10 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లలో స్థానం దక్కించుకుంది. వాటిలో 8 విభాగాల్లో అవార్డును గెలుచుకుంది. అంతే కాకుండా నాలుగు గ్లోబ్ పురస్కారాలను సైతం కైవసం చేసుకుంది.