సెప్టెంబర్ నెలలో వృద్ధి 2 శాతమే!
న్యూఢిల్లీ, అక్టోబర్ 30: దేశంలో ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి నెమ్మదించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో వీటి వృద్ధి రేటు నిరుడు ఇదేనెలతో పోలిస్తే 9.5 శాతం నుంచి 2 శాతా నికి పడిపోయింది. బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం ఎనిమిది కీలక రంగాల్లో మూడు-క్రూడాయిల్, సహజవాయువు, విద్యుదు త్పత్తి వృద్ధి రేటు ఈ సెప్టెంబర్‌లో మైనస్‌లోకి జారిపోయింది.
మిగిలిన ఐదు రంగాలైన బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్ మాత్రం స్వల్ప వృద్ధిని కనపర్చాయి. ఈ ఏడాది ఏప్రిల్ ఆరు నెలల కాలంలో 8 కీలక రంగాలు కలిసి 4.2 శాతం వృద్ధి సాధించాయి. గత ఆర్థిక సంవత్సరంలో నమోదుచేసిన 8.2 శాతంకంటే తక్కువగానే ఇవి వృద్ధిచెందాయి. దేశంలో పారిశ్రామిక రంగం వృద్ధిని కొలిచే పారిశ్రామికోత్పత్తి సూచి (ఐఐపీ)లో ఈ కీలక రంగాలకు 40.27 శాతం భాగం ఉన్నది.