calender_icon.png 8 October, 2024 | 10:11 PM

మందగించిన కీలక మౌలిక రంగాల వృద్ధి

31-08-2024 12:38:35 AM

జూలైలో 6.1 శాతం

న్యూఢిల్లీ, ఆగస్టు 30: దేశంలోని ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి రేటు జూలై నెలలో 6.1 శాతానికి నెమ్మదించినట్లు శుక్రవారం విడుదలైన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. 2024 జూలైలో ముడి చమురు, సహజవాయువుల ఉత్పత్తి తగ్గడం వృద్ధి మందగమనానికి కారణం.  కీలక మౌలిక రంగాలైన బొగ్గు, ముడి చమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్  ఉత్పత్తి 2023 జూలైలో 8.5 శాతం వృద్ధిచెందింది.

అయితే ఈ ఏడాది జూన్‌లో ఈ రంగాలు సాధించిన 5.1 శాతంకంటే జూలైలో వృద్ధి మెరుగుపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మధ్యకాలంలో ఈ ప్రధాన మౌలిక రంగాల వృద్ధి రేటు 6.1 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదేకాలంలో వీటి వృద్ధి 6.6 శాతం. దేశంలో పారిశ్రామిక రంగం వృద్ధిని లెక్కించే పారిశ్రామికోత్పత్తి సూచి (ఐఐపీ)లో ఈ మౌలిక రంగాలు 40.37 శాతం ఉన్నాయి. ఈ జూలైలో క్రూడాయిల్ ఉత్పత్తి 2.9 శాతం, సహజవాయువు ఉత్పత్తి 1.3 శాతం చొప్పున క్షీణించాయి.