calender_icon.png 24 October, 2024 | 12:05 AM

బీమా ఉన్న ఇంటితోనే ధీమా!

14-07-2024 12:05:00 AM

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 13 (విజయక్రాతి): లక్షలు, కోట్లు వెచ్చించి సొంతిల్లు కొనుక్కోవడంతోపాటు ఇంటికి బీమా చేసి ధీమాగా ఉండాలని రియల్ నిపుణులు సూచిస్తున్నారు. హోంలోన్ ఇన్సూరెన్స్‌తోపాటు ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, దొంగతనాల వంటి వాటి నుంచి రక్షణ పొందాలంటే కచ్చితంగా కలల ఇంటికి బీమా చేయించాల్సిందే. గృహ రుణంతో ఇల్లు కొనుక్కున్నవారు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయినా, శాశ్వత అంగవైకల్యం పొందినా, అగ్నిప్రమాదాలు, దొంగతనాలు సంభవించినా ఇంటి ఈఎంఐని యజమాని హోదాలో ఆదుకునేది హోం లోన్ ఇన్సూరెన్స్ మాత్రమే. అలాగే హోంలోన్ ఇన్సూరెన్స్‌తోపాటు ఇంటికి బీమా చేయించుకోవడం వల్ల అనేక ప్రమాదాల నుంచి ఇంటిని రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇంటి కొనుగోలు కోసం సాధ్యమైనంత వరకు బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటారు. అందుకే సదరు ఇంటి రుణానికి బీమా పాలసీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సమగ్ర ఇంటి పాలసీ ముఖ్యమైంది. ఈ బీమా తీసుకుంటే ఇల్లు, అందులో సామగ్రి, ఇంట్లో నివసించే వారికి రక్షణ లభిస్తుంది. ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదం, దొంగతనం వంటివి జరిగినప్పుడు ఈ పాలసీ పూర్తి రక్షణ కల్పిస్తుంది. ఇంటి విలువ, ప్రాంతం, బీమా మొత్తం వంటి అంశాల ఆధారంగా కవరేజ్ వర్తిస్తుంది. అయితే కావాలని చేసే నష్టానికి మాత్రం బీమా వర్తించదు. ఇంటి నిర్మాణంలో ఉపయోగించే వస్తువుల్లో ఏమైనా తయారీ లోపం ఉండి నష్టం జరిగినా బీమా రాదని నిపుణులు చెప్తున్నారు.

ఇంటి నిర్మాణం దెబ్బతిన్న సందర్భాల్లో బీమా కావాలనుకుంటే స్ట్రక్చరల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు. దొంగతనాలు, ఉగ్రదాడుల వంటి ప్రమాదాల సమయంలో ఇంటి నిర్మాణానికి ముప్పు వాటిల్లితే ఈ పాలసీ ద్వారా బీమా పొందవచ్చు. పైకప్పు, ఇంటి నేల, కిచెన్.. ఇలా ఎక్కడ నిర్మాణం దెబ్బతిన్నా పరిహారం మొత్తం బీమా రూపంలో ఇస్తారు. వాతావరణ మార్పులు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సహా ఇతర అవాంఛనీయ సంఘటనల కారణంగా ఈ మధ్య అగ్ని ప్రమాదాలు పెరిగిపోయాయి. అలాంటి ప్రమాదాల నుంచి రక్షించుకునేందుకు ప్రత్యేకంగా అగ్నిప్రమాద బీమా పాలసీ అందుబాటులో ఉంది. అయితే ఇంటి కోసం ఏ పాలసీ తీసుకున్నా ముందుగా వాటి నియమనిబంధనలు, ఫీచర్లు, ప్రీమియం వంటి వివరాలను పరిశీలించాలని రియల్ నిపుణులు సూచిస్తున్నారు.