11-04-2025 01:45:53 AM
ఒకేరోజు 626 పూర్తి.. ప్రక్రియకు అనూహ్యమైన స్పందన
ప్రజల కోసమే సంస్కరణలు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గురువారం స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజే భూయజమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఒకేరోజు 626 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. భూయజమానులు తమకు కావాల్సిన రోజు స్లాట్ బుకింగ్ చేసుకుని, కార్యాలయానికి వెళితే చాలు కేవలం 10 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్లవచ్చు.
registration. telangana.gov. in అనే వెబ్‌సైట్‌ను సందర్శించి బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. సేవల్లో ఏ మాత్రం జాప్యం ఉండదు. సిఫార్సులు, దళారుల జోక్యానికి తావు లేదు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్ నుంచి పర్యవేక్షించారు. ప్రక్రియపై రెవెన్యూశాఖ ఉన్నతధారులను ఆరా తీశారు. కొత్త విధానంతో రిజిస్ట్రేషన్‌కు వచ్చేవారి సమయం మరింత ఆదా అవుతుందన్నారు.
గతంలో కార్యాలయానికి వచ్చిన వారు గంటల తరబడి చెట్ల కింద నిరీక్షించేవారని, క్యూ లైన్లలో నించుని నీరసించేవారని, ఇప్పుడా దుస్థితి లేదన్నారు. ఇక క్యూలైన్లకు గుడ్ బై చెప్పే రోజులు వచ్చాయని, రిజిస్ట్రేషన్ ప్రక్య్రలో ఏమాత్రం దళారులు ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు.
అదనపు ఖర్చులు లేవు..
మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నేను స్లాట్ బుక్ చేశాను. ఆఫీసుకు వెళ్లిన కొన్ని నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. కొత్త విధానం క్రయ విక్రయదారులకు చాలా సౌకర్యంగా ఉంది. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకుని నిర్ణీత సమయానికి వెళితే చాలు. సిబ్బంది చకచకా పనులు చేసేస్తున్నారు. ఈ విధానంలో అదనపు ఖర్చులు సైతం లేవు.
గట్టు శ్రీనివాస్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కొత్త విధానాన్నే కొనసాగించండి..
నేను శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుక్ చేశాను. నా ఫ్లాట్‌ను మరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేయించాను. కొత్త ప్రక్రియ చాలా వెసులుబాటుగా, సమయం ఆదా చేసేవిధంగా ఉంది. రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎలాంటి జాప్యం జరగలేదు. స్లాట్ బుకింగ్ చేసుకునేవారు అరగంటలోగానే పని పూర్తి చేసే విధంగా కొత్త విధానం ఉంది. కొత్త వి ధానంలో అవినీతికి తావు ఉండదని భావిస్తున్నా. కొత్త విధానాన్నే ఎల్లప్పుడూ కొనసాగిస్తే బాగుంటుంది.
ఘన శ్యామ్ పటేల్, శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్