calender_icon.png 24 December, 2024 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొద్దిగా పెరిగిన జీఎస్టీ రాబడి

02-11-2024 01:38:42 AM

  1. అయినా లక్ష్యానికి దూరమే
  2. అక్టోబర్ నాటికి రూ.25,306 కోట్లు
  3. గతేడాది రూ.23,478కోట్లు

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): 2024 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నాటికి జీఎస్టీ వసూళ్లు మోస్తారుగా పెరిగాయి. గతేడాది కంటే ఈసారి 8 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నాటికి జీఎస్టీ రాబడి రూ.25,306 కోట్లుగా ఉంది.

గతేడాది ఇదే సమయానికి రూ.23,478కోట్లు వచ్చినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈసారి 8 శాతం వృద్ధి రేటును నమోదు చేసినా.. బడ్జెట్ లక్ష్యానికి ఆమడదూరంలో వసూళ్లు ఉండటం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో వాణిజ్య పన్నుల శాఖకు ప్రభుత్వం రూ.85వేల కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఇందులో జీఎస్టీ లక్ష్యం రూ.58594.91కోట్లు. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు నెలలు గడిచిపోయాయి. మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ ఏడునెలల్లో రూ.25,306 కోట్లు మాత్రమే జీఎస్టీ వసూలైంది. ఇది బడ్జెట్ అంచనాల్లో 43.18 శాతం మాత్రమే కావడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్న అంశం.

గతేడాది కంటే.. 2 శాతం తక్కువ..

ఈసారి వసూళ్లు పెరిగినా.. వృద్ధిలో మాత్రం గతేడాది కంటె తక్కువ కావడం గమనార్హం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం జీఎస్టీ వసూళ్ల లక్ష్యం రూ.50942.66కోట్లు. అక్టోబర్ నాటికి రూ.23,478కోట్లు వసూలయ్యాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 10 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అయితే ఈ ఏడాది 8 శాతం వృద్ధి రేటును మాత్రమే నమోదైంది. అంటే కంటే 2 శాతం తక్కువ అన్న మాట.

అంచనాలను అందుకోవడం కష్టమేనా?

ప్రభుత్వానికి వచ్చే సొంత రాబడుల్లో వాణిజ్య పన్నుల శాఖ వాటా ఏకంగా 63శాతం. ఇందులో మెజార్టీ షేర్ జీఎస్టీదే. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే 18 శాతం వృద్ధి రేటును సాధించాల్సి ఉంటుంది. కానీ అక్టోబర్ నాటికి విడుదలైన గణాంకాలను బట్టి చూస్తే.. ఏ నెల కూడా ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేదు. సెప్టెంబర్‌లో అయితే ఏకంగా 1 శాతం మాత్రమే వృద్ధి రేటును నమోదు చేసింది. అక్టోబర్ కాస్త మెరుగ్గా 7 శాతం వృద్ధిని సాధించింది. జీఎస్టీ వసూళ్లలో ఇలా ఒడిదొడుకులు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం అనేక అనామానాలు వ్యక్తమవుతున్నాయి.

నాలుగు నెలల తర్వాత స్వల్ప ఊరట..

ఈ ఏడాది మొదటి రెండు నెలలు జీఎస్టీ వసూళ్లు ప్రభుత్వ అంచనాలకు కాస్త దగ్గరగా వచ్చాయి. కానీ ఆ తర్వాత అమాంతం పడిపోయాయి. 18శాతం వృద్ధి రేటును ఆశిస్తే.. వరుసగా నాలుగు నెలల పాటు 6శాతం మాత్రమే వృద్ధి రేటు నమోదైంది. సెప్టెంబర్‌లో అత్యల్పంగా 1శాతం మాత్రం గతేడాది కంటే ఎక్కువ జీఎస్టీ వసూలు కాడవం గమనార్హం. అక్టోబర్‌లో స్వల్ప ఊరట లభించింది. వసూళ్లలో 7శాతం వృద్ధి కనపడింది.

వందశాతం రాబడుల కోసం..

వాణిజ్య పన్నుల శాఖలో అనుకున్న స్థాయిలో రాబడి రాకపోతే.. ప్రభుత్వం అనుకున్న స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడం కష్టతరమవుతుంది. నిధుల కొరత వల్ల ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేసే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

ఈ క్రమంలో ఆదాయంలో భారీ లోటు ఏర్పడితే.. ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎలాగైనా వందశాతం రాబడుల కోసం ప్రభుత్వం వాణిజ్య శాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇతర రాష్ట్రాల్లో జీఎస్టీ వసూలవుతున్న తీరును ఇప్పటికే సంబంధిత శాఖ అధ్యయనం చేసింది. వసూళ్లలో నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.