calender_icon.png 17 April, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెప్పులు శాశ్వతం

31-03-2025 12:00:00 AM

దారిల నడుస్తుంటే

రాయి తగిలి చెప్పు 

ఉంగటం తెగింది

పెద్దయ్య యాది కొచ్చిండు

ఎడమ చేతితో చెప్పును 

తికిచ్చాను

తాను కుడిచేత తీసుకున్నాడు

నాది కుసంస్కారం

అతనిది సంస్కారం

బస్టాండ్ కూడలిలో రోడ్డుపై

యాపచెట్టు కింద కృషించి 

కూర్చున్నడు

పాత చెప్పులన్నీ ముందలేసుకొని ఆలోచిస్తున్నడు

పదేపదే బీడిపొగల్ని వదుల్తున్నడు

మల్తరోజు సంత వున్నందుకేమో

కొత్త చెప్పులు కిలకిలా 

నవ్వుతున్నవి

ఎత్తుగా ఇసుక మట్టిమీద

పరిచిన పాత దుప్పటి

భూగోళ పటంలా

అతని ముందు పన్రాయి

నది దగ్గర తెచ్చినట్లుంది

రాయికి

ఆకురాయంత పదును

తోలుసంచిలో నుంచి

ఒక్కొక్కటి బయటకు తీస్తున్నడు

ఆరె, రంపం, గూటం, దారం, శీలలు, తోలు ముక్కలు వార్లు

వెలుగు కిరణాలలా పనిముట్లు

చెప్పులను మనుషులను కలిపిన మానవుణ్ణీ

నేను తదేకంగా చూస్తున్నా

వచ్చిన చెప్పు వచ్చినట్లే 

కుడుతున్నడు

తువ్వాలలా తోలును పరిచి

అచ్చులు గీశాడు

ఈదుల్లో గీతన్న

కత్తితో లేత మువ్వను కోసినట్లు

త్యాటగా చకచక తోలును 

కోస్తున్నడు

పదును వాడిపోకుండా

కత్తి పదేపదే మిగ్గును 

అద్దుతున్నడు

నల్లదారంతో నాలుగు కుట్లకే 

నక్షత్రంలా మెరిసె

ఇరువై ఏండ్ల నుండి చూస్తున్నా

చిన్న పందిరిలాంటి గుడసె

కవేల పెంకులు ప్లెక్సీలతో పైకప్పు

రోడ్ల విస్తరణలో

చెప్పుల డబ్బా చెత్తకు పోయింది

అదే తావున ఎండ తగులకుండా

గొడుగును నాటాడు

ఏండ్ల సంది రోడ్డే జీవనాధారం

ఎలాంటి చెప్పునా సరే

రెప్పపాటులో కొత్తచెప్పులా 

తయారయితది

తెగిన బొటనవేలు ముకువారు ఉంగటం కప్పులైనా

గూటంతో రెండు దెబ్బలేస్తే

అరచెయ్య మందం తోలైనా 

తమలపాకులోలే

రెండు మొలలు నాలుగు కుట్లకు

చెప్పు నవ్వుతూ కాళ్లకు 

ఇమిడిపోతుంది

వొంటిమీద సోయి పోయినా

కాళ్లకు జోళ్లుండాల్సిందే

దేవుడికీ పావుకోళ్లున్నవి ఊరుకు చెప్పులున్నవి

నరునికి నగరానికి చెప్పులున్నవి

చెప్పుకు పట్టాభిషేకం జరిగింది

చెప్పు చేసిన తాత

చెట్టుకిందనే దిక్కులు చూస్తుండు

అధికారం పోవొచ్చు

అమ్మ నాయిన పొవొచ్చు

ఊరు మునిగిపోవొచ్చు కానీ

చెప్పులు కాళ్ళకు శాశ్వతం

నిరంతరం ప్రయాణంలో

నేనల్సిపోయినా ఒక్కనాడు 

అవి అల్సిపోవు

ఎండ వాన చలులు తుఫానులు వచ్చినా

చంద్రమండలం పోయినా

అవి నన్నంటు పెట్టుకొనే వుంటవి

ముళ్ళు గుచ్చకుండా అరికాళ్ళు కందకుండా

చల్లని వెన్నెలలా రక్షణ కవచాలు

అమ్మ తోడు!

నేను ఇన్నేండ్లు నడిచింది నా పాదాలతో గాదు

మాదిగ పెద్దయ్య చేసిన 

చెప్పులతోనే!

- వనపట్ల సుబ్బయ్య