22-02-2025 12:26:46 PM
లైనింగ్ పనులు జరుపుతుండగా కూలిన పైకప్పు.
పనులు జరుగుతున్న స్థలంలో 70 మందికి పైగా కూలీలు ఏడుగురికి తీవ్ర గాయాలు.
అప్రమత్తమైన అధికారిక వర్గాలు.
నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు నుండి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం(SLBC tunnel collapse) గుండా నల్గొండ(Nalgonda) ప్రాంతానికి సాగు తాగు నీరు అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ప్రాజెక్టు పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. గత పదేళ్లలో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఆ పనులు వేగవంతం చేయాలన్న లక్ష్యంతో నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం సొరంగం పనులు తిరిగి ప్రారంభించింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో లైనింగ్ పనులు జరుగుతుండగా సుమారు మూడు మీటర్ల పరిధి వరకు ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ ప్రాంతంలో సుమారు 70 మందికి పైగా కూలీలు పనిచేస్తుండగా ఏడుగురికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు ద్వారా తెలిసింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అప్రమత్తమై సంఘటన స్థలానికి వైద్య సిబ్బంది ద్వారా కార్మికులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు సంఘటన స్థలానికి మరి కొద్దిసేపట్లో చేరుకోనున్నట్లు తెలిసింది.