05-03-2025 12:33:11 AM
బీజేపీ మండల అధ్యక్షుడు పడిగే దాసు
వెల్దుర్తి, మార్చి 4 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలే చెంపపెట్టు అని బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు పడిగే దాసు అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి మద్దతుదారుడు కొమురయ్య గెలుపొందడంతో మంగళవారం మండల కేంద్రంలోనీ బస్టాండ్ వద్ద ఆ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి సంబరాలు నిర్వహించారు. టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. రేవంత్ రెడ్డి మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులతో పాటు ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందని తెలిపారు.
అభివృద్ధి చేయడం పక్కనపెట్టి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో మోడీ చేపడుతున్న సంస్కరణలకు ప్రజలు ఆసక్తి చెంది బిజెపి వైపు చూస్తున్నారని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోను బిజెపి గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు బాలకిషన్, మాజీ ఉపసర్పంచ్ కర్రె వెంకటేశం, శివకుమార్, బీజేవైఎం మండల అధ్యక్షుడు నవీన్ పటేల్, కిచ్చుగారి శ్రీనివాస్, కెపి గణేష్, యుగంధర్, నాయకులు పాల్గొన్నారు.