ఎన్నికల విధుల్లో ఉన్న అధికారిని కొట్టిన స్వతంత్ర అభ్యర్థి
రణరంగాన్ని తలపించిన దేవలీ నియోజకవర్గం
జైపూర్, నవంబర్ 14: ఉప ఎన్నికల సందర్భంగా బుధవారం రాజస్థాన్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దేవలీ నియోజకవర్గం లో ఎన్నికల విధుల్లో ఉన్న సబ్ మేజిస్ట్రేట్ తనకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులో ఓటు వేయించారని ఆరోపిస్తూ స్వతంత్ర అభ్యర్థి నరేశ్ మీనా ఆయనపై చేయి చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో హింసాత్మక పరిస్థితి ఏర్పడింది. నరేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా ఆయన మద్దతుదారులు అధికారులపైకి రాళ్లు విసిరారు.
వాహనాలకు నిప్పంటించారు. ఈ క్రమంలోనే ఘటనా స్థలం నుంచి నరేశ్ తప్పించుకుని పారిపోయారు. అనంతరం ఎక్స్ వేదికగా తాను ఎవ్వరికీ భయపడననీ, ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు లొంగిపోనని ప్రకటించారు. అయితే పోలీసులు అతణ్ణి గురువారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి దాదాపు 60 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.