calender_icon.png 4 March, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాదచారుల కోసం స్కైవాక్‌లు

04-03-2025 01:54:47 AM

  • మెట్రో స్టేషన్ల నుంచి వాణిజ్య, నివాస సముదాయాలకు..
  • మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 3 (విజయక్రాంతి): నగరంలోని మెట్రో స్టేషన్ల నుంచి వాటి సమీపంలోని వాణిజ్య, నివాస సముదాయాలకు స్కువాక్లను(పైవంతెనలు) నిర్మిస్తామని హెఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. రెండు రోజుల క్రితం హెఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో నిర్వహించిన  కాంప్రెహెన్సివ్ మొబిలిటీ ప్రణాళికా సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సోమవారం ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడించారు.

ఇప్పటికే ఎల్‌అండ్‌టీ వారు పంజాగుట్ట, హైటెక్ సిటీ, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ల నుంచి వారు అభివృద్ధి చేసే మాల్స్‌కు పైవంతెనలు నిర్మించి మెట్రో ప్రయాణికులకు సౌలభ్యాన్ని కల్పించారని పేర్కొన్నారు. జేబీఎస్, పెరేడ్ గ్రౌండ్ స్టేషన్‌లను కలుపుతూ ప్రయాణికులు రోడ్డు దాటే అవసరం లేకుండా స్కువాక్‌లు నిర్మించారన్నారు. 

ఉప్పల్ జంక్షన్ స్కైవాక్ మాదిరిగా..

ఉప్పల్ జంక్షన్ చుట్టూ ఉన్న అన్ని దారులు ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు చేరేలా హెఎండీఏ వారు నిర్మించిన వలయాకారపు రోటరీ స్కువాక్ మెట్రో ప్రయాణికులకు, పాదచారులకు బాగా ఉపయోగపడుతోందని ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

దీన్ని దృష్టిలో పెట్టుకుని మెట్రో స్టేషన్ల నుంచి స్కువాక్ నిర్మాణాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. నగరంలో 69 కిలోమీటర్ల మేర విస్తరించిన హైదరాబాద్ మెట్రో మొదటి దశకు చెందిన మొత్తం 57 స్టేషన్లలో ప్రతి స్టేషన్ వద్ద స్కైవాక్‌లను నిర్మించనున్నట్టు వెల్లడించారు. వీటి ద్వారా ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు సురక్షితంగా రోడ్డు దాటుతారని చెప్పారు. 

నిర్మాణంలో స్కైవాక్‌లు

ప్రస్తుతం డాక్టర్ అంబేద్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్ నుంచి దాని సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫీనిక్స్/ల్యాండ్ మార్క్ మాల్‌కు ఆ సంస్థ వారే స్కువాక్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎల్‌బీ నగర్ స్టేషన్ నుంచి దాని సమీపంలో నిర్మాణంలో ఉన్న వాసవీ ఆనందనిలయం నివాస భవనాల సముదాయానికి వాసవీ గ్రూప్ స్కువాక్ నిర్మిస్తున్నదని చెప్పారు. ఎల్‌బీనగర్‌లోని వాసవీ ఆనందనిలయం కాంప్లెక్స్ 25 ఎకరాలలో ఒక్కొక్క టవర్ లో 33 అంతస్తులతో 12 టవర్స్ నిర్మిస్తోంది.

వాటిలో పెద్ద సంఖ్యలో నివసించబోతున్న అనేక కుటుంబాలకు ఈ స్కువాక్ చక్కటి సౌకర్యం కల్పిస్తుంది. నాగోల్, స్టేడియం, దుర్గం చెరువు, కూకట్  పల్లి వంటి అనేక మెట్రో స్టేషన్ల నుంచి ఈ తరహా స్కువాక్ లు నిర్మించడానికి తమతో చర్చలు జరుపుతున్నారని ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ కేవీబీరెడ్డి తెలిపారు.

మెట్రో స్టేషన్ల నుంచి ఇటువంటి స్కువాక్‌లు నిర్మించుకోవాలనుకునే వారు ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ స్టేషన్ రిటైల్ అధికారి కేవీ నాగేంద్రప్రసాద్‌ను 9900093820 నంబర్‌లో సంప్రదించవచ్చని ఆయన సూచించారు.