ప్రథమస్థానంలో ముంబై, ద్వితీయస్థానంలో హైదరాబాద్
తాజాగా వెల్లడించిన సీబీఆర్‌ఈ నివేదిక
హైదరాబాద్‌లో గరిష్ఠంగా 59 అంతస్తుల భవనాలకు అనుమతులు
నగరం నలుదిక్కులా క్రమంగా విస్తరిస్తున్న ఎత్తున భవనాలు
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 20 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. హైదరాబాద్ నగరం నలుదిక్కులా స్కై స్క్రాపర్స్ భవంతులు విస్తరిస్తున్నాయి. నగరంలో ఎత్తున భవనాలు విస్తరింస్తుండటంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. సింగపూర్, న్యూయార్క్ నగరాలను తలదన్నేరీతిలో హైదరాబాద్ చుట్టూ ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఎత్తున భవనాలు వెలుస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డును లక్ష్యంగా చేసుకొని బిల్డర్లు భారీ నివాస, వాణిజ్య భవనాలను నిర్మిస్తున్నారు.
గరిష్ఠంగా 59 అంతస్థులు
హైదరాబాద్‌లో గరిష్ఠంగా 59 అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయని పురపాలకశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. దేశంలోని మొత్తం హైరైజ్ భవనాల్లో 8 శాతం హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయని, దేశంలో ముంబై తరువాత హైదరా బాద్‌లోనే అత్యధికంగా స్కు స్క్రాపర్స్ ఉన్నాయని సీబీఆర్‌ఈ నివేదిక తాజాగా వెల్లడించింది. మరీ ముఖ్యంగా ఐదారేళ్లుగా నగర నిర్మాణరంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. నిర్మాణపరంగా నగర రూపురేఖలు మార్చే పలు భారీ ప్రాజెక్ట్‌లు నలువైపులా వస్తున్నాయి. గతంలో కనీసం పది అంతస్తుల భవనాలు కూడా లేని ప్రాంతాల్లో ఇప్పుడు 25 అంతకు మించి అంతస్తుల నిర్మాణాలు వస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ శివారులో ఏవైపు చూసినా కనీసం 25 నుంచి 40 అంతస్తుల నివాస, వాణిజ్య భవనాలే దర్శనమిస్తున్నాయి. నగరంలో గరిష్ఠంగా 59 అంతస్తుల వరకు భారీ సై స్క్రాపర్స్ నిర్మాణం జరుగుతున్నాయి. ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు అనుమతులు పొంది పనులు ప్రారంభించగా, మరికొన్ని నిర్మాణ సంస్థలు అనుమతులు పొందే దశలో ఉన్నాయి.
ముంబైలో 77 శాతం..
దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ఉన్న ఎత్తయిన భవనాల్లో సుమారు 77 శాతం ముంబై నగరంలో ఉండగా, తర్వాత స్థానంలో 8 శాతం భవనాలు హైదరాబాద్ లో నిర్మాణం జరుపుకుంటున్నాయి. ముంబై, హైదరాబాద్ తరువాత ఎత్తున భవనాలు 7 శాతంతో కోల్‌కతా, 5 శాతం నోయిడాలో, ఒక్క శాతం గుర్గావ్, బెంగళూరు, చెన్ను నగరాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ మొదటిస్థానంలో ఉండగా బెంగళూరు, చెన్ను నగరాలు దరిదాపుల్లో కూడా లేవు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తయిన భవనాలు అత్యధికంగా ఉన్న నగర జాబితాలో హాంకాంగ్ మొదటిస్థానంలో నిలువగా, షెన్‌ఝెన్, న్యూయార్క్, దుబాయ్ ఇలా అనేక నగరాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే మన దేశానికి సంబంధించి మొదటిస్థానంలో ముంబై ఉండగా, రెండోస్థానంలో హైదరాబాద్ ఉన్నాయి.
కొత్తగా ప్రతిపాధనలు/అనుమతులు..
హైదరాబాద్‌లో 59 అంతస్తులు అంటే 235 మీటర్ల భారీ భవన నిర్మాణం కోసం ప్రతిపాదన ఉండగా, 40 నుంచి 55 అంతస్తుల కోసం దాదాపు 30కి పైగా నిర్మాణ సంస్థల నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి. టీఎస్ బీపాస్‌లో ఇప్పటివరకు 80 ఆకాశహర్మ్యాలు అనుమతులు పొందాయి. వీటిలో 60 అపార్ట్‌మెంట్లు, 22 వరకు వాణిజ్య భవనాలు ఉన్నాయి. ఇలా అనుమతి పొందిన గృహ నిర్మాణాల్లో 14 ప్రాజెక్ట్‌లు 30 నుంచి 45 అంతస్తులపైన నిర్మించబోతున్నవేనని బిల్డర్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మాణమవుతున్న భారీ భవనాలు ఆయా ప్రాంతాలకు ల్యాండ్‌మార్క్‌గా మారుతున్నాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్న ఇంటువంటి భారీ ప్రాజెక్టుల్లో ఇంటి కొనుగోలుతో సమాజంలో తమ స్టేటస్ పెరుగుతుందని, అలాంటి భవనాల్లో నివాసం ఉంటే అందరిలోనూ ప్రత్యేకతను చాటుకోవచ్చని బయ్యర్లు భావిస్తున్నారని బిల్డర్లు చెప్తున్నారు. ఇందుకు అనుగుణంగానే చాలా మంది బిల్డర్లు ఆకాశహర్మ్యాల నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నారని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా పెరిగిన భూముల ధరలు, స్థల యజమానులతో డెవలప్‌మెంట్ ఒప్పందాల కారణంగా కూడా ఎక్కువ అంతస్తులు నిర్మిస్తే తప్ప ఆర్థికంగా ప్రాజెక్ట్ లాభసాటి కాదని నిర్మాణ సంస్థలు భావిస్తున్నాయి.
ఎక్కువగా పడమర దిక్కునే..
హైదరాబాద్ నగరం పడమర దిక్కునే ఆకాశహర్మ్యాలను ఎక్కువగా నిర్మిస్తున్నారు. కనీసం 25 నుంచి 45 అంతస్థుల వరకు నివాస, వాణిజ్య భవనాలు వెస్ట్ హైదరాబాద్ ప్రాంతంలోనే నిర్మాణమవుతున్నాయి. వెస్ట్ హైదరాబాద్‌లోని కోకా పేట, శేరిలింగంపల్లి, ఖాజాగూడ, పుప్పాలగూడ, మియా పూర్, నార్సింగి వంటి ప్రాంతాల్లో 30కి పైగానే ఎత్తున భవనాలకు సంబంధించిన భారీ ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్, ఎల్బీనగర్, బాచుపల్లి, పటాన్‌చెరు వంటి ప్రాంతాల్లోనూ భారీ నివాస భవనాలు వెలుస్తున్నాయి.
హైదరాబాద్ దక్షిణ ప్రాంతంగా చెప్పే అత్తాపూర్, రాజేంద్రనగర్, శంషాబాద్ వైపు ఆకాశహర్మ్యాల నిర్మాణాలు మొదలయ్యాయి. ప్రస్తుతం నగరంలో అతి ఎత్తయిన 58 అంతస్తులు 236 మీటర్ల ఎత్తులో భవనం కోకాపేటలో నిర్మాణ దశలో ఉంది. ఇది కాక 57 అంతస్థులు 200 మీటర్లలో మరొకటి, 55 అంతస్తులు 204 మీటర్లలో రెండు, 54 అంతస్తులు 214 మీటర్ల ఎత్తులో మరో రెండు భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక ఇప్పటికే నగరంలో 45 అంతస్తుల మేర మూడు, 42 అంతస్తుల ఎత్తున మరో మూడు స్కు స్క్రాపర్స్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. ఇప్పటికే నగరంలో 25 నుంచి 36 అంతస్తులతో సుమారు 57 భవనాలు అందుబాటు లోకి వచ్చాయి. నిర్మాణ దశలో ఇలాంటి భవనాలు మరో 50కి పైగానే ఉన్నాయని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు.