calender_icon.png 23 September, 2024 | 7:03 AM

15 మందితో స్కిల్ వర్సిటీ పాలక మండలి!

23-09-2024 02:10:59 AM

  1. ప్రముఖులు, ఉన్నతాధికారులతో ఏర్పాటుకు ఛాన్స్ 
  2. త్వరలో వెల్లడించనున్న రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతలో నైపుణాలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలు ముమ్మరం చేస్తోంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన స్కిల్స్ యూనివర్సిటీ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించారు.

యూనివర్సిటీ నిర్వహణకు నిధులను సమాకూర్చి, ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలను సీఎం కోరా రు. పారిశ్రామికవేత్తలు సైతం సానుకూలం గా స్పందించి కార్పస్ ఫండ్ ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ వీసీ, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌తో సహా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఇతర నియామకాలపై తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

వీసీగా సుబ్బారావు నియామకం..? 

స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా కేంద్ర ప్రభుత్వంలో ప్రిన్సిపల్ ఎకనమిక్ అడ్వయిజర్‌గా పదవీ విరమణ చేసిన వీఎల్‌వీఎస్‌ఎస్ సుబ్బారావు పేరును రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇండియన్ ఎకనమిక్ సర్వీస్‌కు చెందిన సుబ్బారావు సుమారు మూడున్నర దశాబ్దాలపాటు కేంద్రంలో ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, పెట్రోలియం గ్యాస్, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వాణిజ్యం, మానవ వనరులు వంటి పలు శాఖల్లో పనిచేశారు. ఉన్న త విద్యా విభాగంలో అదనపు కార్యదర్శిగా పనిచేసినప్పుడు స్కిల్ కౌన్సిల్ ఇన్‌చార్జిగా సేవలందించారు.. 

కార్పస్ ఫండ్‌కు ముందడుగు..

స్కిల్ యూనివర్సిటీ నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.100 కోట్లు ప్రకటించింది. యూనివర్సిటీ నిర్వహణకు రూ.500 కోట్ల నిధుల సేకరణను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు రూ.150 కోట్ల విరాళాలకు పలువురు పారిశ్రామికవేత్తల నుంచి హామీ వచ్చినట్లు ప్రభుత్వం చెబుతున్నాయి. వీరిలో ఆనంద్ మహీంద్రా, కల్లం సతీశ్‌రెడ్డి, శ్రీని రాజు, డా.నాగేశ్వర్‌రెడ్డి, సుచిత్ర ఎల్లా, పీవీ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది

పాలకమండలి ఇలా..

స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో చైర్మన్‌తో సహా 15 మంది సభ్యు లుగా ఉండనున్నట్లు  సమాచారం. ఇప్పటికే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను చైర్మన్‌గా, ఎం.శ్రీనిరాజు కో చైర్మన్‌గానూ నియమించారు. అయితే సభ్యులుగా కొంతమంది పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. సభ్యులుగా ఎంపిక చేసే వారిలో టీంలీజ్‌కు చెందిన మనీశ్ సబర్వాల్, ఇన్ఫో ఎడ్జ్‌కు చెందిన సంజీవ్ బిక్‌చందానీ, రెడ్డి లేబోరేటరీస్‌కు చెందిన కల్లం సతీశ్‌రెడ్డి, భారత్ బయోటెక్‌కు చెం దిన సుచిత్ర ఎల్లా, మురుగప్ప గ్రూప్‌కు చెందిన ఎంఎం మురుగప్పన్, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి కేపీ కృష్ణన్, ఫిలాంథ్రఫిస్ట్ పగిడిపాటి దేవయ్యతోపాటు ఎక్స్ అఫిషియో సభ్యులుగా వీసీ, ఇద్దరు డీన్‌లు, పరిశ్రమలు, ఆర్థిక శాఖ కార్యదర్శులు ఉండనున్నారని తెలుస్తోంది.