- వీహబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
- 16 కాలేజీలతో వీ-హబ్ ఒప్పందాలు
- పారిశ్రామిక రంగంలో మహిళా భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు
- వీ హబ్ సీఈవో: సీతా పల్లచోళ్ల
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తున్నది. పారిశ్రామికంగానూ అనేక రాయితీలు, ప్రోత్సహాకాలు అందిస్తూ వారి ఎదుగుదలకు కృషి చేస్తున్నది. మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ఏర్పాటైన వీ-హబ్ ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టి మహిళలు పరిశ్రమలను స్థాపించేలా ప్రోత్సహిస్తున్నారు.
ఇప్పటివరకు మహిళలకు కావాల్సిన సహకారం అందిస్తూ వస్తున్న వీ-హబ్ ఇక నుంచి విద్యార్థినులకు కాలేజీ దశలోనే పారిశ్రామిక రంగం పట్ల అవగాహన కల్పించను న్నారు. దీని కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.
పారిశ్రామిక రంగంలో మహిళల భాగాస్వామ్యం పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మహిళలు పారి శ్రామిక రంగంలో నిలదొక్కుకోవాలంటే నైపుణ్యం ఎంతో అవసరమని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి దశ నుంచే ఆ దిశగా నైపుణ్య శిక్షణకు శ్రీకారం చుట్టింది.
16 కాలేజీలతో ఒప్పందం
విద్యార్థినులకు శిక్షణ ఇవ్వడంలో భాగంగా రాష్ట్రంలోని 16 కాలేజీలతో వీ-హబ్ ప్రత్యేక అవగాహన ఒప్పందం చేసుకుంది. ఎంపిక చేసిన ఈ కాలేజీల్లోని విద్యార్థినులకు వీతఎనెబుల్ కార్యక్రమం ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు.
ఆరు నెలల ప్రత్యేక శిక్షణ
వీ-ఎనెబుల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు ఆరు నెలల ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కాలేజీ దశ నుంచి వారిలో సాంకేతికత, వ్యాపారంలో నాయకత్వం వహించేం దుకు కావాల్సిన నైపుణ్యం మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ శిక్షణ కొనసాగుతుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో, పారిశ్రామిక రంగంలో మహిళలకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంతోపాటు సృజనాత్మకత, విశ్వసనీయతతో కూడిన మార్కెటింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది.
అద్భుత అవకాశం
వీ-ఎనెబుల్ కార్యక్రమం విద్యార్థినులకు అద్భుత అవకాశం. 16 కాలేజీలతో ఒప్పందం చేసుకోవడంతో మొదలైన ఈ శిక్షణ భవిష్యత్‌లో వేలాది మంది విద్యార్థినులు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఇందులోభాగంగా ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధనాత్మక అనుభవాలు, మెంటర్‌షిప్, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. మహిళలకు పారిశ్రామిక అనుకూల వాతావరణం ఏర్పాటు కానున్నది.
సీతా పల్లచోళ్ల, వీ హబ్ సీఈవో