09-03-2025 12:28:30 AM
ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కృత్రిమ మేథా (ఏఐ) సాయంతో స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇవ్వనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శనివారం సచివాలయంలో శ్రీధర్‌బాబును తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దిల్‌రాజు ఆధ్వర్యంలో కోణం ఫౌండేషన్ నిర్వాహకులు సందీప్‌కుమార్ కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయులు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా బోధనా సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ప్రోత్సహిస్తామన్నారు. అన్ని రంగాల్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్‌ను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పీపీపీ విధానంలో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నామని శ్రీధర్‌బాబు వెల్లడించారు.
ఇక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ యూనివర్సిటీని కూడా ప్రారంభించబోతున్నట్టు స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏఐ సాయంతో ఉచితంగా స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇస్తున్న ఫౌండేషన్ ప్రతినిధులను ఆయన అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ పాల్గొన్నారు.