calender_icon.png 15 November, 2024 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతకు నైపుణ్య శిక్షణ

23-07-2024 12:05:00 AM

ప్రపంచంలో ఎక్కడా లేని యువత మన దేశంలో ఉంది. సుమారు 80.8 కోట్ల యువత 35 సంవత్సరాలలోపు వారు మన దేశంలో ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రతీ సంవత్సరం లక్షల సంఖ్యలో వివిధ డిగ్రీలు చేత పట్టుకొని మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నిరంతరం పరితపిస్తున్న పరిస్థితి. అయితే, ఈ గ్లోబల్ ఎకానమీలో, పోటీ ప్రపంచంలో మన యువత ఉద్యోగ సముపార్జనలో వెనుకబడిపోతుండటం బాధాకరం.

అకాడమిక్ పరంగా నూటికి నూరు శాతం మార్కులు, మొదటి ర్యాంకులు, గ్రేడులు సంపాదిస్తున్నా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించడంలో విఫలమవుతున్నారు. దీంతో దేశంలో నిరుద్యోగం భారీ ఎత్తున పెరుగుతున్నది. ఫలితంగా దేశం అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించ లేకపోతున్నది. దీనికి కారణాలు అన్వేషించాల్సి ఉంది. కానీ మన పాలకులు ‘త్వరలో భారత్ మూడోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందబోతుందని, 500 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నదని’ ప్రకటనలు అయితే గుప్పిస్తున్నారు. 

ప్రస్తుతం అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం చదువుతోపాటు తగిన సామర్థ్యాలు కలిగిన వారు కేవలం 5% శాతమే ఉన్నారు. మిగిలిన వారు నైపుణ్యాలు లేక నిరుద్యోగంతో మగ్గిపోతున్న పరిస్థితి. కాంపిటీషన్ జాబ్ మార్కెట్లో మార్కులకంటే స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం లభిస్తుందని గ్రహించాలి. అందువల్ల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా, బి.టెక్ చదివినా అసంఘటిత కార్మికులుగా దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ తక్కువ వేతనాలతో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ గ్యాప్‌నుంచి బయట పడాలంటే చదువుకు నైపుణ్యాలకు మధ్య సమతుల్యతను సాధించాలి. అకాడమిక్ చదువు సందర్భాల్లోనే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సహకారంతో వారికి నైపుణ్యాలు అందించాలి. ఇప్పటికే ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన, ఇండియా ఇంటర్నేషనల్ స్కిల్ సెంటర్’ వంటి సంస్థలద్వారా యువతకు నైపుణ్యాలు అందిస్తున్నారు. అయితే, మెట్రో నగరాల్లో, మెగా సిటీస్‌లోనే ఇవి అందుబాటులో ఉంటున్నాయి. 

ప్రభుత్వాలే పట్టించుకోవాలి

ఈ అవకాశాలను ఎక్కువగా పట్టణ, నగర యువత అంది పుచ్చుకుని ముందుకు సాగుతున్నది. అదే సమయంలో గ్రామీణ యువత అవకాశాలు లేక వెలవెల పోతున్నారు. ఈ గ్యాప్‌ను ప్రభుత్వాలు పూరించాలి. చిన్న పట్టణాల్లో, నగరాల్లో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టు బేస్డ్ లెర్నింగ్, ఇంటర్న్‌షిప్ ప్రోత్సాహించాలి. ప్రపంచమంతా డిజిటల్ రూపంలోకి మారుతున్నది. దీనికి అనుగుణంగా సాఫ్టు స్కిల్స్‌తోపాటు డిజిటల్ స్కిల్స్ అభివృద్ధి పరచాలి. యువతను మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో అవకాశాలు అంది పుచ్చుకునే విధంగా తయారు చేయాలి. ‘ఎంపవరింగ్ యూత్’ అనే ధ్యేయంతో సాగాలి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి రంగాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి, కావలసిన తర్ఫీదు ఇవ్వాలి.

ఒకేషనల్ కోర్సుల ద్వారా ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయం వరకూ నైపుణ్యాలు అందించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి చాలినన్ని నిధులు మంజూరు చేయాలి. మౌలిక వసతులు కల్పించాలి. గ్రంథాలయాలు, లేబరేటరీలు ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయ, అధ్యాపకుల ఖాళీలు భర్తీ చేయాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందించే చదువుకు, స్టెమ్, సామాజిక శాస్త్రాలకు ప్రాధాన్యమివ్వాలి. విద్యాలయాల్లో రాజకీయ జోక్యం తగ్గించాలి. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు భారత్ భవిష్యత్తును తీర్చిదిద్దే నైపుణ్యాలు కలిగిన యువతను అందించాలి. అప్పుడే 2047 నాటికైనా భారత్ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడగలుగుతుంది. 

 ఐ.ప్రసాదరావు