calender_icon.png 11 January, 2025 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైపుణ్యమే మన ఆయుధం

14-07-2024 12:00:00 AM

‘యునెస్కో’, ‘వరల్డ్ స్కిల్స్’ అనే అంతర్జాతీయ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 2015 నుంచి ప్రతి ఏటా 15 జూలైన ‘ప్రపంచ యువ నైపుణ్యాల దినం’ (వరల్డ్ యూత్ స్కిల్స్ డే)ను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. యువ నైపుణ్యాలతో శాంతి, సుస్థిరాభివృద్ధి (యూత్ స్కిల్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్‌మెంట్) అనే ఇతివృత్తంతో ఈ ప్రత్యేక రోజును జరుపుకుంటారు. ఆర్థిక అసమానతలు రూపు మాపడం, మానవాళి ఎదుర్కొంటున్న పలు సంక్షోభాలకు పరిష్కారాలు వెతకటం, మానవాళి సులభతర జీవితాలకు అంతర్జాల అనువర్తనాలను విస్తృ త పరచడం, బహుముఖీన సమగ్రాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించడం లాంటి సత్ఫలితాలకు కావలసిన ఏకైక వనరు నైపుణ్య యువత మాత్రమే.

‘అప్‌డేట్’ లేదా ‘అవుట్ డేట్’

‘ప్రపంచ యువ నైపుణ్యాల దినం’ వేదికగా అంతర్జాతీయ యువత, ముఖ్యంగా భారతీయ యువతకు నైపుణ్యాలపట్ల పరిజ్ఞానం పెంపొందించడం, మారుతున్న కాలానికి వాటిని మెరుగు పరచుకోవడం నిరంతరం కొనసాగాలని నిపుణులు సూచిస్తున్నారు. నిన్నలో జీవిస్తే పాత తరం మనుషులుగా ‘అవుట్ డేటెడ్’ అయ్యే ప్రమాదం ఉంటుంది. రేపటి నైపుణ్యాలను ‘అప్ స్కిల్లింగ్’ద్వారా నేడే చేజిక్కించుకొని ‘అప్ డేట్’ అయితే అంచెలంచెలుగా ఎదుగుతాం. నిరుద్యోగ భూతాన్ని ప్రపంచం నుంచి తరిమేయగల శక్తివంతమైన సాధనం నవ సమాజం కోరుకునే ‘నైపుణ్యాలు’ మాత్రమే. అర్హతకు తగిన ఉద్యోగం, గౌరవప్రదమైన పని, ఆకర్షణీయ వేతనం, ఔత్సాహికులుగా ఎదగడం లాంటి లక్ష్యాలను చేరుకోవడానికి ఉద్యోగ సాధన నైపుణ్య నిచ్చెన ఎక్కాల్సిందే.  

అత్యధిక యువశక్తి మన సొంతం

ప్రపంచ మానవాళి సగటు వయసు 2020లో 31 సంవత్సరాలు ఉండగా, 2050 నాటికి 38 ఏండ్లకు పెరుగుతుందని అంచనా. భారతదేశ జనాభా సగటు వయసు 28.2 ఏండ్లు మాత్రమే ఉండడంతో మన దేశాన్ని యువ భారతం లేదా ‘యువ ఉప్పెన’ (యూత్ బల్జ్)గా పిలుస్తున్నాం. 810 కోట్ల ప్రపంచ జనాభాలో 15 ఏండ్లలోపు యువత 16 శాతం, అంటే 120 కోట్లు ఉంటారని అంచనా. ప్రపంచ దేశాల్లో 25 ఏండ్లలోపు యువత 50 శాతం, 35 ఏండ్లలోపు యువత 65 శాతం ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా యువత అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ అగ్రభాగాన ఉంది. భారత్‌లోని 144 కోట్ల జనాభాలో 66 శాతం అంటే 80.8 కోట్లు 35 ఏండ్లలోపు యువత ఉన్నారు. 2024లో దేశంలోనే యువత మొత్తం ఉపాధి/ఉద్యోగ సామర్థ్యం 52.25 శాతం ఉందని, భారతీయ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌లో ఉపాధి సామర్థ్యం 64 శాతం ఉన్నట్లు అంచనా.

వరమా, శాపమా?

ఉన్నత విద్య డిగ్రీ పట్టాలు చేతుల్లో ఉన్నప్పటికీ వేగవంతమైన సాంకేతిక మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలు లేకపోవటంతో యువభారతం ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నది. మన యువ ఇంజినీర్లలో అర్హతకు తగిన ఉద్యోగం, వేతనం పొందడంలో 80 శాతం యువత విఫలమవుతున్నారు. దాదాపు 50 శాతం యువ భారత ఇంజినీర్లు సరైన ఉద్యోగాలు దొరక్క నిరుద్యోగులుగా మిగిలి పోతున్నారు. నైపుణ్యాలు గడించని యువత దేశానికి భారమని, శాపమని తెలుసుకోవాలి. యువ భారతం నైపుణ్య మంత్రం జపిస్తే దేశానికి వారంతా వరంగా మారుతారు. 

ఉన్నత చదువుల్లో ఉత్తమ శ్రేణి మార్కులు లేదా ర్యాంకులు పొందడంతోపాటు పలు సాంకేతిక, వ్యక్తిగత నైపుణ్యాలను కూడా ఏకకాలంలో ఒడిసి పట్టిన యువత భవిత ఉజ్వలంగా ఉంటుందని నేటి డిజిటల్ యుగం బోధిస్తున్నది. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, అకాడమిక్ మేధావుల మేలు కలయికతో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ‘నైపుణ్య విశ్వవిద్యాలయం’ (స్కిల్స్ యూనివర్సిటీ) ఏర్పాటు చేయడా నికి నిర్ణయించడం ఆహ్వానించదగ్గ పరిణామం. యూనివర్సిటీ డిగ్రీతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా కనీస అర్హత అయిన డిజిటల్ యుగ యువతలో నైపుణ్యాభివృద్ధికి సాధికార కృషి చేయడం ముదావహం. నూతనంగా ఏర్పాటు కానున్న ‘స్కిల్స్ యూనివర్సిటీ’ని రాజకీయాలకు అతీతంగా ఒక స్వయం ప్రతిపత్తిగల ఉన్నత విద్యాసంస్థగా నెలకొల్పాలి. 

ఈ యూనివర్సిటీలో నైపుణ్యత ఆధార కోర్సులు, పాఠ్యాంశాలు, ఉద్యోగావకాశాలకు ప్రాధాన్యతను ఇస్తూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఐఐటి, ఐఎస్‌బీ స్థాయి విద్యను, నైపుణ్యాలను అందించే సంస్థగా తీసుకురావాలని నిపుణులు, విద్యావేత్తలు, యువత కోరుకుంటున్నారు. భారత యువజనులు శాంతిదూతలుగా ఎదిగి, సవాళ్లను నైపుణ్య ఆయుధాలతో అధిగమించి, సుసంపన్న సమాజాన్ని స్థాపించి, సామర్థ్యపు రెక్కలతో అంతర్జాతీయ యవనికపై సగర్వంగా భారతీయ పతాకాన్ని ఎగరేయాలని సగటు ప్రజలు ఆశిస్తున్నారు.

 డా. బుర్ర మధుసూదన్ రెడ్డి