- అసెంబ్లీలో వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్‌బాబు
- హైదరాబాద్ కేంద్రంగా ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’
- యువతలో నైపుణ్యాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు
- 17 కోర్సుల్లో ఏటా 20 వేల మందికి శిక్షణ
- దక్షిణాదిలో మొదటి రాష్ట్రం తెలంగాణే
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): ప్రస్తుతం యువత ఉపాధి కోసం శ్రమించాల్సి వస్తుంది. కష్టపడి ఉద్యోగం సంపాదిస్తున్నా ఎక్కువ రోజులు నిలుపుకోవడం లేదు. చిన్న సంక్షోభం తలెత్తినా ఉద్యోగాలకు ఎసరు వస్తుంది. యువత లో నైపుణ్య లేమీ ఇందుకు ప్రధాన కారణం. యువతకు ఉపాధి కల్పనలో ఉత్పన్నమయ్యే సమస్యలకు రాష్ట్ర ప్రభు త్వం శాశ్వత పరిష్కారం చూపనున్నది. యువతలో నైపుణ్యాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నది. దీనికి సంబంధించిన బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ
ఢిల్లీ, హర్యానాలో ఉన్న స్కిల్ యూనివర్సిటీలను పరిశీలించి, రాష్ట్రంలో యూనివర్సిటీ ఏర్పాటుకు పరిశ్రమల విభాగం నమూనా ముసాయిదాను తయారు చేసింది. అందులో నిర్వహించే కోర్సులు, వాటి వ్యవధి, మౌలిక వసతులు, నిధులు, వివిధ కంపెనీల భాగస్వామ్యంపై పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఇప్పటికే ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ అందించారు. నూతనంగా ఏర్పాటు చేయబోయే యూనివర్సిటీకి ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’గా పేరు పెట్టనున్నారు. ఈ యూనివర్సిటీకి పరిశ్రమల శాఖే నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనున్నది.
17 కోర్సులు.. ఏటా 20 వేల మందికి శిక్షణ
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో స్వయం ప్రతిపత్తి ఉండేలా స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పనున్నారు. మూడు నాలుగేండ్ల కాల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతోపాటు ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సర్టిఫికెట్ కోర్సులు నిర్వహిస్తారు. వివిధ రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎంపిక చేశారు. అందులో భాగంగా 17 ప్రాధాన్య రంగాలను గుర్తించారు.
అందులో ఫార్మా, నిర్మాణ, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఈకామర్స్, లాజిస్టిక్స్, రిటెయిల్, యానిమేషన్, విజువల్స్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ వంటి కోర్సులు ఉన్నాయి. ప్రతి కోర్సును సంబంధిత రంగంలో పేరొందిన ఒక కంపెనీ భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేయనున్నారు. ప్రభుత్వం ఆయా కంపెనీలతో ఎంవోయూ చేసుకుంటుంది. తొలి ఏడాది రెండు వేల మందితో ప్రారంభించి, క్రమంగా ఏడాదికి 20 వేల మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టనున్నది. ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అటువంటి కోర్సుల్లో ఎక్కువ సీట్లు కేటాయించేందుకు అవకాశం ఉన్నది.
దక్షిణాదిలో తొలి రాష్ట్రం తెలంగాణే
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో 12 స్కిల్ యూనివర్సిటీలున్నాయి. గుజరాత్‌లో 2, మహారాష్ట్రలో 2, రాజస్థాన్‌లో 2, సిక్కింలో 2 చొప్పున ఉండగా.. ఢిల్లీలో 1, హర్యానాలో 1, పంజాబ్‌లో 1, పశ్చిమ బెంగాల్‌లో 1 ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఏర్పాటు చేసేది 13వ స్కిల్ యూనివర్సిటీ. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీలన్నీ ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. తెలంగాణలో ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీ దక్షిణ భారతదేశంలోని మొదటిది కావడం విశేషం.
అసెంబ్లీలో యూనివర్సిటీ బిల్లు
శాసనసభలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్కిల్స్ యూనివర్సిటీ (యువ భారత నైపుణ్యాల విశ్వవిద్యాల యం ప్రైవేట్ భాగస్వామ్యం) 2024 బిల్లును మంగళవారం ప్రవేశపెట్టారు. ఈ వర్సిటీ ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణను అందించి ఉద్యోగావకాశాలు కల్పించేవి ధంగా పీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) మోడ్ లో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.