- ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షల ఖర్చు
- యావరేజ్ ఫీజు రూ.50 వేలు
- 2025 కల్లా 10 వేల మందికి శిక్షణ
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): ఉద్యోగం రాలేదని బాధపడే విద్యార్థులను చూశాం.. వచ్చినా నైపుణ్యం లేక దానిని కోల్పోయిన సందర్భాలను చూస్తున్నాం. అయితే, ఇకముందు అలాంటి పరిస్థితులకు అవకాశం ఉండకపో వచ్చు. రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించి అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అంకురార్పణ చేసింది. విద్యార్థుల్లో నైపుణ్యా భివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నది.
ఇకపై ఉద్యోగాల కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా చూస్తుంది. రంగమేదైనా అందు లో నైపుణ్యం పెంపొందించేలా ఈ యూనివర్సిటీ నిర్వహణ ఉండబోతుంది. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతోపాటు ఉద్యోగ అవకాశాలను కూడా చేరువ చేస్తుంది. గురువారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో విశేషాలు ఇవి..
2024 ప్రవేశ పెట్టే కోర్సులు
ప్రసుత్త పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సులను 2024 25లో ప్రారంభించనున్నారు. అందులో ఈ అండ్ లాజిస్టిక్స్‌లో 400 మందికి అవకాశం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్ కోర్సులో 400 మందికి, నిర్మాణరంగ కోర్సులో 400 మందికి, ఫార్మాస్స్యూటికల్స్ కోర్సులో 400 మందికి రిటైల్ కోర్సులో 200 మందికి విజవల్స్, యానిమేషన్, విజువల్స్ ఎఫెక్ట్స్ కోర్సులో 200 మంది చొప్పున శిక్షణకు అవకాశం కల్పించనున్నారు.
ఒక్కో విద్యార్థిపై 1.25 లక్షల ఖర్చు
ఢిల్లీ స్కిల్స్ యూనివర్సిటీ, హర్యానాలోని విశ్వకర్మ స్కిల్స్ యూనివర్సిటీతో పోల్చుకుంటే తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో తక్కువ ఖర్చుతోనే విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఢిల్లీ లో ఒక్కో విద్యార్థి శిక్షణకు రూ.1.55 లక్షలు, హర్యానాలో ఒక్కో విద్యార్థికి రూ.1.40 లక్షలు ఖర్చు చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం రూ.1.25 లక్షల ఖర్చుతోనే నైపుణ్య శిక్షణను ప్రభుత్వం అందించనున్నది.
20 మందికి ఒక్కరు
స్కిల్స్ యూనివర్సిటీలో ఒక డీన్‌తోపాటు 1ః2ః6 నిష్పత్తిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారు. 20 మంది విద్యార్థులకు ఒకరు చొప్పున ఫ్యాకల్టీని నియమిస్తారు. మొత్తంగా మొదటి సంవత్సరం 2వేల మంది విద్యార్థులకు 100 మంది ఫ్యాకల్టీ ఉంటారు. వారికి యూజీసీ గైడ్‌లైన్స్ ప్రకారం జీతభత్యాలు ఉండనున్నాయి.
ఛాన్స్‌లర్‌గా గవర్నర్ లేదా సీఎం
స్కిల్స్ యూనివర్సిటీకి ఛాన్స్‌లర్‌గా గవర్నర్ గానీ, సీఎం గానీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. వీరితోపాటు 15 మంది బోర్డు ఆఫ్ గవర్నర్స్ ఉంటారు. మొత్తంగా వైస్ ఛాన్స్‌లర్, రిజిస్ట్రార్, రెక్టార్, ఫైనాన్స్ ఆఫీసర్స్, కంట్రోలర్, డీన్ ఉంటారు.
2025 కల్లా 10 వేల విద్యార్థులు
2024 సంవత్సరంలో 2 వేల మంది విద్యార్థులకు స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా శిక్షణ అందించడంతోపాటు 2025 కల్లా 10 వేల విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి సంవత్సరం ౬ కోర్సులను ప్రవేశపెట్టనుండగా, రెండో ఏడాది ఏడు కోర్సులను, మూడో ఏడాది నాలుగు కోర్సులను ప్రవేశపెట్టనున్నది.
17 కోర్సులు.. 27 కంపెనీలు
ఈ యూనివర్సిటీలో మొత్తం 17 కోర్సు ల్లో శిక్షణ ఇవ్వనున్నారు. హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్, బ్యాం కింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్స్యూరెన్స్, యానిమే షన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్, నిర్మాణం, అడ్వాన్డ్స్ మ్యానుఫాక్చరింగ్, రిటైల్, ఈ అండ్ లాజిస్టిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రికల్చర్, బ్యూటీ అండ్ వెల్‌నెస్, మీడి యా అండ్ ఫిల్మ్, ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్, డిజిటల్ డిజైన్స్, సెంటర్ ఫర్ కెరీర్ రెడీనెస్ ఉన్నాయి. కోర్సులకు సంబంధించిన ఉద్యోగావకాశాలపై 27 పరిశ్రమలతో ఇప్పటికే ఒప్పందం కూడా చేసుకుంది. తద్వారా శిక్షణ అనంతరం వెంటనే ఆయా పరిశ్రమల్లో ఉద్యోగం పొందే సువర్ణావ కాశం విద్యార్థులకు లభిస్తుంది.
కోర్సు ఫీజు 50 వేలు
ఢిల్లీ యూనివర్సిటీలో యావరేజ్ కోర్సు ఫీజు రూ.35 వేలు, విశ్వకర్మ యూనివర్సిటీలో రూ.30 వేలుగా ఉంది. తెలంగాణ ప్రభుత్వ కాలేజీల్లో రూ.20వేలు ఉండగా, ప్రైవేట్ కాలేజీల్లో రూ.60 వేలు ఉంది. అయితే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో దీనిని రూ.50 వేలుగా ఖరారు చేశారు. యూనివర్సిటీలో శిక్షణ కోసం 70 శాతం విద్యార్థులు మొత్తం ఫీజును చెల్లించాల్సి ఉండగా 5 శాతం మందికి ఇండస్ట్రీ స్కాలర్‌షిప్ ద్వారా, 25 శాతం మంది విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వనున్నది.
రియింబర్స్‌మెంట్‌లో 60 శాతం ప్రభుత్వం చెల్లిస్తే మిగితాది విద్యార్థి చెల్లించాలి. తద్వారా యూనివర్సిటీకి మొదటి సంవత్సరం రూ.10 కోట్లు, రెండో సంవత్సరం రూ.52 కోట్లు, మూడో సంవత్సరం రూ.108 కోట్లు సమకూరనున్నాయి. మొత్తంగా మూడేండ్లలో రూ.170 కోట్లు సమకూరుతాయి. అయితే యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మూడేళ్లలో మొత్తం రూ.312 కోట్లు ఖర్చు అవుతుండగా అందులో రూ.170 కోట్లు ప్రభుత్వానికి సమకూరనున్నాయి. అయితే ఇంకా రూ. 142 కోట్లు కావాల్సి ఉంది.