04-04-2025 01:10:35 AM
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య
హనుమకొండ, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి): మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.
గురువారం హనుమకొండ జిల్లా, దామెర మండలం, ల్యాదెళ్ల గ్రామంలో సాగునీటి పారుదల శాఖ భవనాలలో జిల్లా గ్రామీణ అభివృద్ధి ఆధ్వర్యంలో వి- హబ్ సహకారంతో ఏర్పాటు చేయనున్న పరకాల స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఎమ్మెల్యే, కలెక్టర్ సందర్శించారు.మహిళల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో నెలకొల్పాల్సిన మౌలిక వసతులు, ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతిని గురించి ఏర్పాట్లను గురించి డిఆర్డీవో మేన శ్రీను, సంబంధిత శాఖల అధికారులను ఎమ్మెల్యే, కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య లు మాట్లాడుతూ త్వరలో ప్రారంభించనున్న మహిళల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో కావాల్సిన అన్ని వనరులు, సదుపాయాలను అధికారులు త్వరగా సమకూర్చాలన్నారు. మహిళలకు వివిధ ఉపాధి అంశాల గురించి తెలియజేసేందుకు శిక్షణ కేంద్రంలో అనువుగా భవనం ఉండాలన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో మహిళలు ఆర్థిక పురోగతిని సాధించేందుకు శిక్షణా కార్యక్రమాలు అందించేందుకు ఏర్పాట్లను సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో డిఆర్డిఓ మేన శ్రీను, ఆర్డీవో డాక్టర్ కె నారాయణ తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మి సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.