calender_icon.png 7 January, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులవృత్తులకు ‘స్కిల్ డెవలప్‌మెంట్’

05-01-2025 02:13:26 AM

  1. బీసీ సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయింపుల్లో ఇబ్బంది ఉండొద్దు
  2. అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాం తి): కుల వృత్తులకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. శనివారం  బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ఆయన శాఖాపరమైన బడ్జెట్ సన్నాహక  సమావేశం నిర్వహించారు.

గత బడ్జెట్‌లో బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు, అమలు తదితర వాటి పై అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో చేపట్టాల్సిన సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయింపుల్లో ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.  బీసీ సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న పథకాలను ‘చేయూత’ ద్వారా వాటికి కేటాయించే బడ్జెట్ ప్రతిపాదనలపై పలు సూచనలు చేశారు.

ఇప్పటికే ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలు పెంచిందని దానిని మెనూ ప్రకారం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్‌లో పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు విద్యార్థులకు యూనిఫామ్స్ , పుస్తకాలు ఇతర వస్తువులు అందించాలన్నారు. బీసీ గురుకుల పాఠశాలలకు నూతన భవనాల కోసం ప్రతిపాదనలు పెట్టాలన్నారు.

ఇప్పటికే గీత కార్మికుల కోసం 10 వేల మందికి కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేశామని, వాటిని మరింత ఎక్కువ మందికి అందించాలన్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన విధంగా మోడ్రన్ దోబీఘాట్లు ప్రతీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

కుమ్మరి వృత్తి వారి నుంచి అధునాతన వస్తువులు, మట్టి పాత్రలు, కప్స్, వాటర్ బాటిల్స్ తయారు చేసి మట్టి పాత్రలపై అవగాహన కల్పించాలని చెప్పారు.  కాగా, ఈ నెల 17న మరోసారి సమావేశాన్ని ఏర్పాటు చేసి వివిధ ప్రతిపాదనలపై మరోసారి చర్చించనున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, కమిషనర్ బాల మాయాదేవి, బీసీ గురుకులాల కార్యదర్శి సైదులు పాల్గొన్నారు.