calender_icon.png 1 November, 2024 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.300 కోట్లతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

17-07-2024 05:35:04 AM

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా రూ.300 కోట్ల వ్యయంతో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రపంచంలోని పది ప్రఖ్యాత యూనివర్సిటీలు ముందుకొచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా 25 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే  ‘ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్‌ఎఫ్)’, అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా ఉన్న ‘స్టార్టప్ రన్‌వే’ సంస్థల ప్రతినిధులతో మంగళవారం సెక్రటేరియట్‌లోని తన కార్యాలయంలో శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు.

అంతర్జాతీయంగా స్టార్టప్‌లను ప్రోత్సహించే ఈ రెండు సంస్థలకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, యూకేలోని లండన్ బిజినెస్ స్కూల్ లాంటి పది ప్రఖ్యాత స్కిల్ వర్సిటీలతో శిక్షణకు సంబంధించిన ఒప్పందాలున్నాయని, సెప్టెంబర్ 26, -28 మధ్య నగరంలో జరిగే ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ సదస్సులో ఈ  యూనివర్సిటీల ప్రతినిధులు కూడా పాల్గొంటారని శ్రీధర్‌బాబు తెలిపారు. ఐఎస్‌ఎఫ్ చైర్మన్ జేఏ చౌదరి, డైరెక్టర్ శేషాద్రి వంగల ఆధ్వర్యంలో టెక్సాస్ రిచర్డ్ సన్‌సిటీ, ఫ్రిస్కోసిటీల ప్రతినిధులు తనను కలిసి తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ’లో సంయుక్తంగా కార్యకలాపాలు చేసేందుకు ఆసక్తి చూపినట్లు తెలిపారు.

అమెరికా, బ్రిటన్‌కు చెందిన కంపెనీలు ఏఐ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు సంధానకర్తలుగా ఈ ప్రతినిధులు వ్యవహరిస్తారన్నారు. రాష్ట్రంలోని స్టార్టప్ కంపెనీల ఉత్పత్తులకు అమెరికాలో మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడానికి సహకరిస్తారన్నారు. ఈ సమావేశంలో టెక్సాస్‌లోని ఫ్రిస్కో మాజీ మేయర్ మహెర్ మేసో, రిచర్డ్‌సన్ సిటీకి చెందిన ప్రతినిధులు క్రిష్ షాక్లెట్, గ్రెగ్ సోవెల్, స్టార్టప్ రన్‌వే వ్యవస్థాపకుడు మహేశ్ నంద్యాల, సివోవో రవీంద్రరెడ్డి, చిన్మయ్‌దాస్, జ్యోత్స్న కొండపులి, అర్చన చిందం పాల్గొన్నారు.