calender_icon.png 30 October, 2024 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కిల్ వర్సిటీ ద్వారా యువతలో నైపుణ్యాభివృద్ధి

02-08-2024 01:22:02 AM

డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ మఖ్తాల

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): స్కిల్స్ యూనివర్సిటీతో కలిసి పనిచేసేందుకు అంతర్జాతీయస్థాయి యూనివర్సిటీలు పోటీ పడుతున్నాయని, ఈ వర్సిటీ ద్వారా యువతలో నైపుణ్యాలు వృద్ధి చెందుతాయని వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ) చైర్మన్ సందీప్ మఖ్తాల అన్నారు. గురువారం ఆయన అంతర్జాతీయ యూనివర్సిటీల అంగీకార పత్రాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అందించి మాట్లాడారు.

టీ కన్సల్ట్ వేదికగా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్, డర్బన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ, కేప్ పెనిన్‌స్యూలా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ షార్జా, మలేసియా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లు స్కిల్స్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుంటున్నాయన్నారు. గ్లోబల్ క్యాంపస్‌ల్లో తెలంగాణ విద్యార్థులు అభ్యసించేందుకు యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఎంతో ఉపకరిస్తుందన్నారు.

నైపుణ్యాలు వృద్ధి చెందిన తర్వాత సునాయా సంగా యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు అనంతరం యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ డైరెక్టర్ డాక్టర్ జేతో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ స్కిల్స్ యూనివర్సిటీకి తమ సహకారం అందిస్తామని డాక్టర్ జే తెలిపారు. మంత్రిని అమెరికాలోని తమ వర్సిటీ రావాలని ఆహ్వానించారు. టీటా, డబ్ల్యూటీఐ టీసీతో కలిసి ప్రభుత్వం చేపడుతున్న ఏఐ ఇంటర్నేషనల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం గురించి డాక్టర్ జేకి మంత్రి వివరించారు. మంత్రిని కలిసిన వారిలో డబ్ల్యూటీఐటీసీ హెచ్‌ఆర్ కౌన్సిల్ చైర్మన్ మద్దెల రాంచందర్, ఈశ్వర్ కొండుకూరి, శివప్రసాద్ ఉన్నారు.