- డిగ్రీతోపాటు సరికొత్తగా మినీ డిగ్రీ కోర్సు
- ఆన్‌లైన్ పోర్టల్‌లో 10 వేల స్టూడెంట్స్ డేటా
- క్యాంపస్ సెలక్షన్లలా ఆన్‌లైన్ సెలక్షన్లు
- 38 కాలేజీల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం
- దేశంలోనే వినూత్న ప్రయోగానికి నేడు శ్రీకారం
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఈ ఏడాది డిగ్రీ, ఇంజినీ రింగ్‌లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్స్యూరెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రెగ్యులర్ డిగ్రీతోపాటు మినీ డిగ్రీ కోర్సుగా బీఎఫ్‌ఎస్‌ఐ నైపుణ్య శిక్షణను అందించే వినూత్న కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభిస్తోంది.
సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తారు. ఉన్నత విద్యా మండలి గుర్తించిన 18 ఇంజినీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న 10 వేల మంది విద్యార్థులకు ఈ శిక్షణను అందించనుంది. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరిగేలా కాలేజీలను ఎంపిక చేసింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జాబ్ డిమాండ్ ఉన్న బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతోంది. అత్యంత ఖరీదైన ఈ కోర్సును డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉచితంగా అందించనుండటం విశేషం.
ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్
ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షణను అందుకుంటున్న 10 వేల మంది విద్యార్థుల వివరాలతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ రూపొందిస్తుంది. విద్యార్థుల బయోడేటాతోపాటు చదువుతున్న కాలేజీ, వారి విద్యార్హతలు, సాంకేతిక కోర్సుల అనుభవం వంటి వివరాలన్నీ పోర్టల్‌లో పొందుపరుస్తారు.
బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో పేరొందిన కంపెనీలు తమకు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసుకునేందుకు ఈ పోర్టల్ వారధిగా పనిచేస్తుంది. బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీలు ఈ పోర్టల్‌లో ఉన్న విద్యార్థులతో నేరుగా వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసే వీలుంటుంది. దీంతో డిగ్రీ, ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులకు చదువుతోపాటు ఉద్యోగ భరోసాకు ప్రభుత్వం కొత్త బాటలు వేసింది.
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సహకారంతో బీఎఫ్‌ఎస్‌ఐ కన్సార్టియం మినీ డిగ్రీ కోర్సుకు అవసరమైన సిలబస్‌ను రూపొందించింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా సీఎస్‌ఆర్ నిధులను సమీకరించి మూడేళ్లపాటు ఈ శిక్షణను అందించేలా మంత్రి శ్రీధర్‌బాబు బీఎఫ్ ఎస్‌ఐ సంస్థ ప్రతినిధులతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు.
EQUIPPP అనే సంస్థ ఈ ప్రోగ్రాంకు రూ.2.50 కోట్లు అందించేందుకు ముందుకొచ్చింది. విద్యార్థులకు ఉపాధి కల్పించేలా జీసీసీలకు, ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా ఉండటంతోపాటు సీఎస్‌ఆర్ నిధలను సమీకరించనుంది.
కోర్సుకు ఎంపిక చేసిన కాలేజీలు
నాన్ ఇంజినీరింగ్ 20 కాలేజీలు
- పింగళి ప్రభుత్వ మహిళా కాలేజీ, వడ్డేపల్లి, హనుమకొండ
- ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, ఖమ్మం
- నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నల్లగొండ
- ఆంధ్రా మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, హైదరాబాద్
- భవన్ డిగ్రీ, పీజీ కాలేజీ, హైదరాబాద్
- ప్రభుత్వ సిటీ కాలేజీ, హైదరాబాద్
- ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సిద్దిపేట
- ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, బేగంపేట
- ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఖైరతాబాద్
- ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీ, నాంపల్లి
- నిజాం కాలేజీ, హైదరాబాద్
- ఆర్‌బీబీఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీ, హైదరాబాద్
- సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కాలేజీ, మెహిదీపట్నం
- సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా డిగ్రీ కాలేజీ, హైదరాబాద్
- సెయింట్ పియస్ ఎక్స్ మహిళా డిగ్రీ కాలేజీ, నాచారం
- తారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సంగారెడ్డి
- ఎంవీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, మహబూబ్‌నగర్
- ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కరీంనగర్
- తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోఠి
- గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ, నిజామాబాద్
ఇంజినీరింగ్ కాలేజీలు
- బీవీఆర్‌ఐటీ హైదరాబాద్ ఇంజినీరింగ్ కాలేజీ (జేఎన్‌టీయూహెచ్)
- జీ నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (జేఎన్‌టీయూహెచ్)
- గోకరాజు రంగరాజు ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ (జేఎన్‌టీయూహెచ్)
- జేబీ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ (జేఎన్‌టీయూహెచ్)
- జేఎన్‌టీయూ కూకట్‌పల్లి ప్రధాన క్యాంపస్ (జేఎన్‌టీయూహెచ్)
- కేశవ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జేఎన్‌టీయూహెచ్)
- మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జేఎన్‌టీయూహెచ్)
- వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ (జేఎన్‌టీయూహెచ్)
- వల్లూరుపల్లి నాగేశ్వర్‌రావు విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జేఎన్‌టీయూహెచ్)
- కిట్స్ వరంగల్ (కేయూ)
- చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఓయూ)
- మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజీ (ఓయూ)
- మాటూరి వెంకట సుబ్బారావు ఇంజినీరింగ్ కాలేజీ (ఓయూ)
- మెథడిస్ట్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ (ఓయూ)
- ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీ (ఓయూ)
- స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ (ఓయూ)
- ఆర్జీయూకేటీ బాసర (ఆర్జీయూకేటీ)
- బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నర్సాపూర్(జేఎన్‌టీయూహెచ్)