22-02-2025 02:00:07 AM
* ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా?
* ఇదిగో ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ ఇదే
* కేంద్ర బడ్జెట్ పై దమ్ముంటే బహిరంగ చర్చకు రండి
* కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి, బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి
*పెద్దపల్లిలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ వీడియో విడుదల చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్
పెద్దపల్లి, ఫిబ్రవరి 21: లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్) పేరుతో కాంగ్రెస్ నేతలు రూ.50 వేల కోట్ల దండుకునేందుకు స్కెచ్ వేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎల్‌ఆర్‌ఎస్ పేరిట పైసలు ఎవరూ చెల్లించొద్దని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ర్ట ప్రజలకు ఉచితంగా భూములను క్రమబద్దీకరిస్తామని గత ఎన్నికల్లో హామీలిచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు డబ్బులు ఎందుకు దండుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సంద ర్భంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేటి సీఎం, నాటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలు మాట్లాడిన మాటల వీడియో క్లిప్పింగ్స్‌ను బండి సంజయ్ మీడియాకు విడుదల చేశారు.
ఇచ్చిన మాట మేరకు ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేయాల్సిందేనని, లేని పక్షంలో ప్రభుత్వ మెడలు వంచుతామని బండి హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రి స్థానిక నేతలు గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి, ఇతర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను, ఉద్యోగులను, ఉపాధ్యాయులను నిండా ముంచిం దని, ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదని, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు పడుతున్న బాధలు వర్ణణాతీతమన్నారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని మాట తప్పారు? 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేన్ ఇచ్చి .. వాటిలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా భర్తీ చేయలేదని, నియామకాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగు తోందని, కానీ ఏకంగా 55 వేల పోస్టులను భర్తీ చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని, ఈ పోస్టులన్నీ గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ల ఫలితమే.
యువతకు నెలకు 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మాట తప్పారు. 14 నెలల పాలనలో ఒక్కో నిరుద్యోగికి 56 వేల రూపాయలు కాంగ్రెస్ బాకీ పడిందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో రూ. 7,500 కోట్ల బకాయిలు పేరుకు పోయినయని, దీనివల్ల విద్యాసంస్థల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు సకాలంలో జీతా లు ఇవ్వలేని దుస్థితి నెలకొందని, 15 శాతం కమీషన్ ఇస్తేనే ఫీజు రీయంబర్స్ మెంట్ బిల్లులు చెల్లిస్తామని కొందరు మంత్రులు చెబుతున్నారని, ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా అన్నారు.?
ఉద్యోగ, ఉపాధ్యాయులు తొలి పీఆర్సీ జాప్యంవల్ల 21 నెలల పాటు నష్టపోయారు. ఇప్పుడు రెండో పీఆర్సీని నేటికీ అమలు చేయకపోవడంవల్ల 20 నెలలుగా నష్టం జరుగుతూనే ఉన్నా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని, 317 జీవో తెచ్చి కేసీఆర్ ప్రభుత్వం చెట్టుకొకరిని పుట్టకొకరిని చేస్తే ఈ జీవోను సవరించి న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప పూర్తిస్థాయిలో అమలు చేసి చర్యలు తీసుకోలేదని, 5 డీఏలు పెండింగ్ లో పెట్టింది. సరెండర్ లీవ్స్ ఎన్ క్యాష్ మెంట్ చేసుకునే అవకాశం లేదని, ఆఖరికి జీతం పైసల్లోంచి దాచుకున్న జీపీఎఫ్, గ్రాట్యుటీ పైసలు కూడా ఇవ్వడం లేదని,
పెండింగ్ డీఏలు, జీపీఎఫ్ బకాయిలు, మెడికల్ బిల్లులు, గ్రాట్యుటీ పెన్షన్ బకాయిలు మొత్తం కలిపితే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం 8 వేల 200 కోట్లు బాకీ పడ్డది. గత ఏడాది(2024లో) 8 వేల మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారని, ఈ ఏడాది మరో 10 వేల మంది రిటైర్డ్ కాబోతున్నరని, వీళ్ల రిటైర్డ్ మెంట్ బెన్ ఫిట్స్ చెల్లించాలంటే 11 వేల కోట్ల రూపాయలు కావాలే... ఇప్పటి వరకు ఒక్కరికి కూడా బెన్ ఫిట్స్ ఇయ్యలేదని, ఆశ్చర్యమేందంటే ఉద్యోగులకు రెగ్యులర్ గా చెల్లించాల్సిన వివిధ రకాల బిల్లుల పైసలమీద కూడా కాంగ్రెసోళ్లు సీలింగ్ (పరి మితి) పెట్టిర్రు.
నెలకు వెయ్యి కోట్లదాకా చెల్లించాల్సి ఉండగా... రూ. 300 కోట్ల కంటే ఎక్కవ రిలీజ్ చేయొద్దని ఆదేశాలిచ్చిందని, ఇదేందని అడిగితే పైసల్లేవని అంటున్నరని నెలల తరబడి ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ బిల్లుల కోసం రిటైర్డ్ మెంట్ బెన్ ఫిట్స్ కోసం జీపీఎఫ్ లో దాచుకున్న సొమ్ము కోసం ఆర్ధిక మంత్రి పేషీ చుట్టూ.. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. హఆ పైసలు రాక బిడ్డల పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నరు.
కుటుంబాలు గడవక చేయిచాచి అప్పులు అడగలేక లోలో న కుమిలి కుమిలిపోయి గుండె ఆగి చని పోతున్నారు.హెల్త్ కార్డులు కూడా సక్కగ పనిచే యట్లే మెడికల్ బిల్లులు ఇయ్యకుండా సతాయించే విద్యా వ్యవస్థ పరిస్థితి ఘోరం బడ్జెట్ లో 15 శాతం నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మొన్నటి బడ్జెట్‌లో సగం కూడా (7 శాతమే) నిధులు కేటాయించలే కేటాయించిన బడ్జెట్ లోనూ కోతలే కనిపిస్తున్నాయి. స్కూళ్లు కాలేజీల్లో సరైన సౌకర్యం లేవు.
రెగ్యులర్ హెడ్మా స్టర్లు కూడా లేరు. మండలాల్లో రెగ్యులర్ ఎంఈవోలే లేరు. సగానికిపైగా జిల్లాల్లో ఇంకా ఇంఛార్జీ డీఈవోల పాలనే కొనసాగుతోంది. స్కూళ్లలో చాక్ పీసులకు కూడా పైసల్లేవ్.స్కావెంజర్లు లేరు.పట్ట భద్రుల,మ ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ చేసిన పోరాటాలను త్యాగాలు చేసింది బీజేపీ మాత్రమే. జీతాల కోసం కొట్లాడి ఫస్ట్ నాడు జీతమొచ్చేలా చేసినం.బదిలీలు ప్రమోషన్ల కోసం లాఠీదెబ్బలు తిని సాధించినాము.
317 జీవోపై యుద్దం చేసి జైలుకు వెళ్లినం గ్రూప్1 పేపర్ లీకేజీపై కొట్లాడితే హిందీ పేపర్ లీకేజీ అంటూ దొంగ కేసు పెడితే జైలుకు పోయి నా భయపడ లేదు.జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ చేసినం. కుల గణన అంతా తప్పుల తడక బీసీ జనాభాను తగ్గిం చే కుట్ర జరుగుతోంది. బీసీ జాబితాలో ముస్లింలను ఎట్లా కలుపుతారు..? 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెబుతూ అందులో 10 శాతం ముస్లింలకు ఇస్తే... ఇక మిగిలేది 32 శాతమే.
ముస్లిం రిజర్వేషన్లకు మేం బరాబర్ వ్యతిరేకం. ముస్లింలను కలిపి బీసీ బిల్లు పంపితే కేంద్రం నుండి మళ్లీ వెనక్కు పంపి తీరుతాం. ముస్లింలను తీసేసి 42 శాతం బిల్లు పంపితేనే కేంద్రాన్ని ఒప్పిస్తాం. బీసీ రిజర్వేషన్ల పేరుతో ప్రజలను మోసం చేసినందుకు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో టెన్ జనపథ్, ఏఐసీసీ కార్యాలయం వద్ద, హైదరాబాద్‌లో గాంధీ భవన్ వద్ద ధర్నా చేయాలి. మేం వాస్తవాలు మాట్లాడుతుంటే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని డైవర్షన్ రాజకీయా లు చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి దమ్ముం టే కేంద్ర బడ్జెట్ రాష్ర్ట బడ్జెట్ పై బహిరంగ చర్చకు రావాలి. ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి 1.08 లక్షల కోట్లు ఇచ్చినం. లెక్కా పైసలతో సహా వివరించేందుకు నేనే వస్తా హామీ బడ్జెట్ లో చేసిన మోసాలను కూడా వివరిస్తా... మీరూ రండి. ఎవరేం చేశారో ప్రజల ముందుంచుదాం. గతేడాది రాష్ర్ట బడ్జెట్‌లో ఇండ్ల నిర్మాణం కోసం కేటాయించిన 7 వేల కోట్ల సంగతి కూడా తేలుద్దాం.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ ఆర్‌ఎస్ (లే అవుట్ క్రమబద్దీకరణ పథకం) పేరుతో రూ.50 వేల కోట్లు దండుకునేందుకు సిద్ధమైంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి,భట్టి విక్రమార్క,ఉత్తమ్ కుమార్,సీతక్క తదితరులు చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి? “ఎల్‌ఆర్‌ఎస్ ను ఉచితంగా చేస్తాం. పైసలు తీసుకో మనీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చే స్తాం. బీఆర్‌ఎస్ చేస్తానంటే చేయించుకోకండి”అని మీరు చెప్పింది నిజం కాదా? ఇదిగో ఆధారాలు.. (వీడియో క్లిప్‌ను విడుదల చేశారు). ఆనాడు రేవంత్ రెడ్డి ఏమన్నడు.. బీఆర్‌ఎస్ పోయింది. ఎల్ ఆర్‌ఎస్ వచ్చింది.
రేపు ఎంఆర్‌ఎస్ (మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీం) ను కూడా కేసీఆర్ తెస్తడని అనలేదా? మరి మీరు చేస్తుందేమిటి? ఎల్‌ఆర్‌ఎస్ తో పైసలు దండుకోవాలనుకుంటున్నారా? ఆ పైసలు చాలవని రేపు మనిషి పుట్టినా, చచ్చి నా కూడా పైసలు కట్టాలని డీఆర్‌ఎస్ (డెత్ రెగ్యులరైజేషన్ స్కీం) బీఆర్‌ఎస్(బర్త్ రెగ్యులరైజేషన్ స్కీం) తెస్తారా? ఏంది? తెచ్చినా తెస్తారు... అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయబోయే పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యా యులందరినీ వేడుకుంటున్నారని,..కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి, బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివని, నయవంచనకు... ధర్మ రక్షణకు మధ్య జరుగుతున్న ఎన్నికలని, ఈ ఎన్నికల్లో తీర్పు కోసం యా వత్ రాష్ర్టం ఎదురు చూస్తోందని, మీతోపాటు సామాన్య ప్రజలు కూడా మీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నారని, బీజేపీ బలపర్చిన అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కేంద్ర మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.