calender_icon.png 28 February, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియుడి కోసమే భర్త హత్యకు స్కెచ్

28-02-2025 12:49:52 AM

  •  డాక్టర్ హత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులు
  •  ప్రియుడితో పాటు ఏఆర్ కానిస్టేబుల్‌కు సుఫారీ
  •  ముగ్గురిని రిమాండ్‌కు పంపించిన పోలీసులు

జనగామ, ఫిబ్రవరి 27(విజయక్రాంతి): ప్రియుడి కోసం ఓ మహిళ ఏకంగా భర్తనే హతమార్చేందుకు తెగించింది. వివాహేతర బంధానికి అడ్డువస్తున్నాడని మొత్తమే అడ్డు తొలగించుకునేందుకు మర్డర్ ప్లాన్ చేసింది. ఈ దారుణ చర్యలో భర్త చావు అంచుల వరకు వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల వరంగల్ లోని బట్టుపల్లి రోడ్డులో డాక్టర్‌పై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. నిందితుల వివరాలను గురువారం వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ వెల్లడించారు.

వరంగల్‌కు చెందిన డాక్టర్ సుమంత్‌రెడ్డి, ఫ్లోరా మరియా 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2018లో పలు పనుల నిమిత్తం వీరు సంగారెడ్డికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ డాక్టర్ సుమంత్‌రెడ్డి పీహెచ్‌సీలో కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తుండగా ఫ్లోరా ఓ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. అదే సమయంలో సంగారెడ్డిలోని ఓ జిమ్ సెంటర్‌లో ఫ్లోరా చేరారు. దీంతో జిమ్ కోచ్ ఎర్రోల్ల శామ్యూల్‌తో చనువు ఏర్పడి వివాహేతర బంధానికి దారితీసింది.

ఈ విషయం డాక్టర్ సుమంత్‌రెడ్డికి తెలియడంతో మళ్లీ వరంగల్‌కు షిఫ్ట్ అయ్యారు. 2019లో ఫ్లోరా మరియా అధ్యాపకురాలిగా ఉద్యోగం సాధించారు. మొదట జనగామ జిల్లాలోని పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కాలేజీలో పనిచేసి, ఆ తరువాత వరంగల్‌లోని రంగశాయిపేట కాలేజీకి మారారు. దీంతో సుమంత్‌రెడ్డి వరంగల్‌లోని వాసవీ కాలనీలో నివాసముంటూ కాజీపేటలో ప్రైవేటు హాస్పిటల్ నడిపిస్తున్నాడు. 

అడ్డు తొలగించాలని...

సుమంత్‌రెడ్డి కుటుంబం వరంగల్‌కు వచ్చినప్పటికీ భార్య ఫ్లోరా సంగారెడ్డి జిమ్ కోచ్ శామ్యూల్‌ను మరిచిపోలేదు. నిత్యం వీరు ఫోన్‌లో మాట్లాడుకోవడమే కాకుండా శామ్యూల్ తరచూ ఇంటికి వచ్చి వెళ్తుండే వాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయం సుమంత్‌రెడ్డికి తెలియడంతో మరోసారి గొడవలు ముదిరాయి. దీంతో ఎలాగైనా భర్త అడ్డును తొలగించుకోవాలని భావించిన ఫ్లోరా ఆయన హత్యకు స్కెచ్ వేసింది. ఇందుకోసం ప్రియుడు శ్యామ్యూల్‌తో అతడి స్నేహితుడైన సంగారెడ్డికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్ సహాయం తీసుకుంది.

వారికి కొన్ని రోజుల క్రితం ఖర్చుల కోసం రూ.లక్ష పంపించింది. ఈ నెల 20న పక్కా పథకం ప్రకారం హాస్పిటల్ ముగించుకుని ఇంటికి వస్తున్న డాక్టర్ సుమంత్‌రెడ్డిని బట్టుపల్లి రోడ్డులో కారును అడ్డగించి రాడ్లు, సుత్తితో విచక్షణా రహితంగా దాడి చేశారు.

సుమంత్‌రెడ్డి మృతిచెందాడనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ ఆయన కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫ్లోరా, శ్యామ్యూల్, రాజ్‌కుమార్ లను హంతకులుగా గుర్తించి అరెస్టు చేశారు.