calender_icon.png 20 September, 2024 | 9:10 AM

‘శ్రీరాంసాగర్’కు 61 వసంతాలు

27-07-2024 12:15:14 AM

  1. ఉత్తర తెలంగాణ జల వరప్రదాయిని ఈ ప్రాజెక్ట్
  2. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన తొలి ప్రధాని నెహ్రూ 

నిజామాబాద్, జూలై 26 (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు శుక్రవారంతో 61 వసంతాలు నిండాయి. నిజాం పాలనలోనే మానేరు వ్యాలీ ప్రాజెక్టుల పేరుతో ఇక్కడ 400 టీఎంసీల సామర్థ్యంతో భారీ ప్రాజెక్టను నిర్మించాలని తలపెట్టగా, నిజాం రాజ్యం భారత యూనియన్‌లో విలీనం కావడంతో ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి. 1963 జూలై 26న తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. 1983లో పనులు పూర్తయ్యాక అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 109 టీఎం సీల నిల్వ సామర్థ్యంతో 3,143 అడుగుల పొడవు, 140 అడుగుల ఎత్తుతో ఆనకట్టకు రూపకల్పన జరిగింది. ఇంజినీర్లు ఆనకట్టకు అనుసంధానంగా 125 అడుగుల పొడవు, 475 అడుగుల పొడవైన మట్టికట్ట నిర్మించారు.

వరదలు వచ్చినప్పుడు నీటిని విడుదల చేసేందుకు 42 ఫ్లడ్ ఫ్లో గేట్లు, వరదలతో పాటు వచ్చిన బురదను తొలిగించేందుకు ఆరు మడ్ ఫ్లో గేట్లను అమర్చారు. ప్రాజెక్ట్‌కు అనుసంధానంగా 36 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించారు. ప్రాజెక్టు నుంచి కాకతీయ, సరస్వతి, లక్ష్మి, ఇందిరమ్మ కాలువలకు నీరు పారుతుంది. కాకతీయ కెనాల్  నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమై ఉమ్మడి కరీం నగర్, వరంగల్, నల్గొండ జిల్లాలు, సరస్వతి కెనాల్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా, లక్ష్మి కెనాల్ నిజామాబాద్ జిల్లాకు జలాలను అందిస్తుంది.

ఇందిరా వరద కాలువ ద్వారా కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాంకు జలాలు తరలివెళ్తాయి. ప్రాజెక్ట్ ద్వారా 16 లక్షల ఎకరాలకు సాగునీరు అం దుతుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు 61 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రాజెక్ట్ వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి శుక్రవారం ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్‌రావు గుప్త, ఈఈ చక్రపాణి నివాళి అర్పించారు.