నేడు అల్గునూరులో బీఆర్‌ఎస్ ‘దీక్షా దివస్’
కరీంనగర్, నవంబర్ 28 (విజయక్రాంతి): ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు శుక్రవారంతో 16 ఏళ్లు నిండాయి. 2009 నవంబర్ 29న స్వరాష్ట్రం కోసం ఆయన చేపట్టగా ఆయన్ను పోలీసులు కరీంనగర్ జిల్లా అల్గునూరులో అరెస్ట్ చేశారు. అరెస్టు అనంతరం ఆయన్ను ఖమ్మం జైలుకు తరలించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు పెద్ద ఉద్యమానికి దారితీశాయి. ఉద్యమంలో సకల జనులు పాల్గొని ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉవ్వెత్తున ఎగసింది.
నాటి కేంద్ర ప్రభుత్వ యూటర్న్ తర్వాత, ప్రజలు మళ్లీ ఉద్యమం చేపట్టడంతో 2 జూన్, 2014న తెలంగాణ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ప్రతి నంబర్ 29న నాటి ప్రభుత్వం ‘దీక్షా దివాస్’ నిర్వహిస్తూ వస్తున్నది. గులాబీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా కార్యక్రమాలు నిర్వహించేవి. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. గతేడాది డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పగ్గాలు చేపట్టి కూడా ఏడాది పూర్తవ్వబోతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. 2009లో కేసీఆర్ అరెస్టున అల్గునూర్‌లోనే శుక్రవారం ‘దీక్షా దివాస్’ జరుగనున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యక్రమానికి హాజరుకానున్నారు.