calender_icon.png 6 October, 2024 | 3:50 PM

ఆరు పేపర్లు.. ఏడు రోజులు

05-10-2024 01:21:09 AM

పదో తరగతి వార్షిక పరీక్షల్లో స్వల్ప మార్పులు

సైన్స్ పరీక్ష రెండు రోజుల పాటు నిర్వహణ

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యా శాఖ స్వల్ప మార్పులు చేసింది. ఈమేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో టెన్త్ వార్షిక పరీక్షలను 11 పేపర్లతో నిర్వహించే విధానం ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా సమయంలో దీన్ని 6 పేపర్లకు కుదించారు.

కరోనా అనంతరం కూడా ఆరు పేపర్లతోనే పరీక్షలను నిర్వహించే విధానాన్ని కొనసాగించారు. విద్యార్థులకు ఒక్కో పేపర్‌కు 3 గంటల సమయం ఇస్తున్నారు. అయితే ఈ ఆరు పేపర్లలో భాగంగా సైన్స్ పరీక్షను ఒకే యూనిట్‌గా రెండు పేపర్లకు పరీక్షలను నిర్వించే విధానం ఉంది. అంటే.. ఫిజికల్ సైన్స్ పేపర్, జీవశాస్త్రం పేపర్‌కు వేర్వేరుగా పరీక్షలు పెడుతున్నా రెండింటిని కలిపి ఒకే యూనిట్‌గా పరిగణిస్తారు.

ఈ రెండు పరీక్షల్లో వచ్చిన మార్కుల మొత్తాన్ని సైన్స్ పేపర్‌గా భావిస్తారు. ఈ పరీక్షలో భాగంగా ఒక్కో పేపర్‌కు 1.30 గంటల సమయం ఇస్తున్నారు. ఒక పేపర్ పరీక్ష ముగిసిన తర్వాత మధ్యలో 20 నిమిషాల గడువును ఇచ్చి రెం డో పేపర్ పరీక్షను  నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులపై ఒత్తిడి పడుతోందని, సరిగా పరీక్ష రాయడంలేదని అభిప్రాయాలున్నా యి.

ఈక్రమంలోనే తాజా ఉత్తర్వులు ప్రకా రం ఇక నుంచి సైన్స్ పరీక్షను రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఒకరోజు ఫిజికల్ సైన్స్ పేపర్‌ను, మరో రోజు జీవశాస్త్రం పేపర్ పరీక్షను నిర్వహించనున్నారు. ఒక్కో పేపర్‌కు 1.30 గంటల సమయాన్ని ఈసారి ఇవ్వనున్నారు. ఈ విధానాన్ని తొమ్మిది, పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి అమలు చేయనున్నారు.