calender_icon.png 20 January, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్షణకు 6 లక్షల కోట్లు

24-07-2024 02:55:32 AM

  • గతేడాదితో పోలిస్తే 4.8 శాతం పెంపు 
  • ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా కేటాయింపులు 
  • రక్షణ రంగానికి తొలిసారి 12.9 శాతం

న్యూఢిల్లీ, జూలై 23: ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో రక్షణపై కీలకంగానే వ్యవహరిస్తోంది. ఈసారి కూడా కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.6.22 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాది డిఫెన్స్‌కు రూ.5.94 లక్షల కోట్లు ఇచ్చారు. గతేడాదితో పోలిస్తే 4.8 శాతం పెంచారు. మొత్తంగా చూస్తే ఈ ఏడాది బడ్జెట్‌లో 12.9 శాతం రక్షణ రంగానికి ఇచ్చారు. ఇందులో రూ.1.05 లక్షల కోట్లు ఆత్మనిర్భర్ భారత్ కోసం దేశీయ మూలధన సేకరణకు వినియోగిస్తున్నట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. బడ్జెట్ చరిత్రలో రక్షణ రంగానికి ఈ స్థాయి కేటాయింపులు ఇదే తొలిసారి కావడం విశేషమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాజ్‌నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. 

దేశీయ సామర్థ్యం మెరుగదలకు..

సాయుధ బలగాల బలోపేతం కోసం రూ.1.72 లక్ష ల కోట్లు కేటాయించారని, మరో రూ.1.05 లక్షల కోట్లు దేశీయ క్యాపిటల్ సేకరణతో ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తుందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. సరిహద్దు రోడ్లకు గతేడాదితో పోలిస్తే 30 శాతం బడ్జెట్ పెంచడం, దీంతో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) మౌలిక సదుపాయాలను మరింత పెంచగలుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ వ్యవస్థలోనూ స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలతో పాటు ఆవిష్కరణలకు సాంకేతిక పరిష్కారాలకు నిధులు సమకూర్చేందుకు ఐడీఈఎక్స్ పథకానికి రూ.518 కోట్లు కేటాయించామని సింగ్ తెలిపారు. అయితే, ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.6.21 లక్షల కోట్లు కేటాయించడం గమనార్హం. 

సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలకు..

సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలకు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌కు రూ.6,500 కోట్లు కేటాయించారు. వ్యూహాత్మక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనున్నారు. అంతేకాకండా సరిహద్దు ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక వృద్ధిని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో పాటు భారత కోస్ట్‌గార్డ్ వ్యవస్థకు రూ.7,651 కోట్లు అందించనుంది. ఇందులో రూ.3,500 కోట్లు మూలధన వ్యయం కింద కేటాయించింది. ఈ నిర్ణయం ద్వారా సముద్రాల్లో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంతో పాటు ఇతర దేశాలకు మానవతా సాయం అందించేందుకు కోస్ట్‌గార్డుల సామర్థ్యాన్ని పెంచనుంది.